(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా ప్రజలు ఏది జరగకూడదు అనుకున్నారో అది జరిగిపోతోంది. విద్యార్థులు, విపక్షాలు, ప్రజాసంఘాలు దేనినైతే అడ్డుకోవాలని కొన్నిరోజులుగా నిరంతరం పోరాటం చేస్తున్నారో దాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ప్రతిష్టాత్మకమైన విజయనగరం ఎమ్మార్ కాలేజీలో ఒక భాగమైన జూనియర్ కాలేజీని మూసివేసేందుకు సమాయత్తమైనట్లు స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ సుస్పష్టం చేశారు. ఎమ్మార్ జూనియర్ కాలేజీ మూసివేయబోతున్నట్లు దిలియోన్యూస్ డాట్ కామ్ తొలిరోజులనుంచి కథనాలు అందిస్తోంది. దానికి తగ్గట్టుగానే బొత్స ఒక ప్రకటన చేసేశారు.
కాలేజీని యాజమాన్యం నిర్వహించలేననడంతోనే ..
ఎం.ఆర్.జూనియర్ కళాశాలను అన్ ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించడం లేదని, మూసివేస్తామని పేర్కొంటూ మాన్సాస్ యాజమాన్యం రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డుకు లేఖ రాసిన దృష్ట్యా అక్కడ చదివే విద్యార్ధులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీట్లు కేటాయించి, వారంతా తమ విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
అందుకోసం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సామర్ధ్యాన్ని పెంచుతున్నామని తెలిపారు. విజయనగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్‌తో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. మహరాజా అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే విద్యార్ధులెవ్వరికీ ఇబ్బందులు కలగనివ్వబోమని, వారందరూ తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. (ఇది కూడా చదవండి : కాలేజీ మూసేస్తే అవమానం కాదా?)
అధికారులతో సమీక్ష
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం ఉన్న వసతి సౌకర్యాలు, విద్యార్ధుల సంఖ్య, అధ్యాపకులు, బోధనా సిబ్బంది తదితర అంశాలపై కళాశాల ప్రిన్సిపాల్, ఇంటర్మీడియెట్ ప్రాంతీయ అధికారి మంజులవీణ తదితరులతో మంత్రి బొత్స సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలో ఇప్పటికే ఉన్న విద్యార్ధులకు అదనంగా ఎం.ఆర్.కళాశాల నుండి మరో 200 మంది విద్యార్ధులు చేరే అవకాశం వుంటుందన్నారు. (ఇది కూడా చదవండి : ఎమ్మార్ కాలేజీ విషయంలో ఎవరి రాజకీయం వారిది )
అదనపు విద్యార్ధులను చేర్చుకునేందుకు, అదనపు సెక్షన్లు ప్రారంభించేందుకు ఎంతమంది అధ్యాపకులు, ఎన్ని తరగతి గదులు అవసరమవుతాయనే అంచనాలు రెండు రోజుల్లో రూపొందించాలని కళాశాల ప్రిన్సిపాల్, ప్రాంతీయ తనిఖీ అధికారిని ఆదేశించామన్నారు. గురువారం మరోసారి సమావేశమై ఈ ఏడాది విద్యార్ధులను చేర్పించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు అదనపు సీట్లు మంజూరు చేయడంతో పాటు, ఇక్కడ అదనపు అధ్యాపకులు, సిబ్బందిని, అదనంగా కొన్నికోర్సులను మంజూరు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ రామకృష్ణను ఫోన్‌లో కోరామన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్ కాలేజీని యాజమాన్యం నిర్వహించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలని విద్యార్థులు, ప్రజాసంఘాలు మొత్తుకుంటున్నా మాన్సాస్ యాజమాన్యం పట్టించుకోకపోవడం, ప్రభుత్వం అది కుటుంబ వ్యవహారం (ఇది చదవండి : అక్కాచెల్లెళ్ల పోరు ) అంటూ తప్పుకుంటండటంలో ఆంతర్యం ఏంటో స్థానికులకు అంతుపట్టడం లేదు.