విజయనగరం జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ఎం.ఆర్. కాలేజీ ప్రైవేటీకరణకు మాన్సాస్ పూర్వ ఛైర్మన్, కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు హయాంలోనే బీజం పడినట్లు తెలుస్తోంది. ఎం. ఆర్. కళాశాలను అప్పటి ప్రిన్సిపాల్ ఎయిడెడ్ నుండి అన్ ఎయిడెడ్ కు మార్చేందుకు తద్వారా ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే ప్రతిపాదన రూపొందించారు.
ఈ ప్రతిపాదన అశోక్ గజపతిరాజు దృష్టికి తీసుకువెళ్లగా కళాశాలను అన్ఎయిడెడ్ గా మార్చితే సిబ్బంది జీతాలు ఇచ్చుకోవడం మాన్సాస్‌కు పెనుభారమవుతుందని , ఇది సరైన నిర్ణయం కాదని తిరస్కరించారు.
ఇటీవల మాన్సాస్ గవర్నింగ్ బాడీ సమావేశంలో మరోమారు ఎం. ఆర్. కాలేజీ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చిన వెంటనే ప్రస్తుత ఛైర్ పర్సన్ సంచైత ఆమోదముద్ర వేశారు. ఆ ఫైల్ వడివడిగా విద్యాశాఖ కమిషనర్ కు చేరడం, ఆయన పరిశీలించమని ఆర్జేడీకి సిఫార్స్ చేయడం జరిగింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు అశోక్ నుండి సంచైత వరకు ఈ ప్రైవేటీకరణ పాపానికి అందరూ బాధ్యులేనని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు.
అటువంటి ప్రతిపాదనకే ఆస్కారం లేకుండా అశోక్ తన హయాంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే సరిపోయేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అప్పటికి ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించడం మంచి నిర్ణయమే అయినప్పటికీ.. ఆయన ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇప్పటి యాజమాన్యానికి అవకాశం లభించిందని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. మాన్సాస్ విచ్ఛిన్న ప్రక్రియకు అశోక్ అంకురార్పణ చేశారని , సంచైత కొనసాగిస్తున్నారని, ఇందుకు మాన్సాస్ లో చోటుచేసుకున్న అనేక పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయని , వీరెవరికీ ప్రజాశ్రేయస్సు పట్టడంలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అట్టుడుకుతున్న విజయనగరం
ఎం.ఆర్. కాలేజీ ప్రైవేటీకరణ ప్రతిపాదనపై విజయనగరం అట్టుడుకుతోంది. ఈ విషయం లియో న్యూస్ డాట్ కామ్ వార్తతో వెలుగులోకి వచ్చిన మరుక్షణమే విపక్షాలైన సీపీఎం, లోక్ సత్తా తదితర పార్టీలు ఆక్షేపించాయి. పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎం. ఆర్. కళాశాల ప్రైవేటీకరణకు ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. లోక్ సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ దీన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎం. ఆర్. కాలేజీ ప్రైవేటీకరణ ప్రతిపాదన అర్థరహితమన్నారు. దీన్ని విరమించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
ఎస్ ఎఫ్ ఐ ఆందోళన
ఎం.ఆర్. కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదన వెంటనే ఉప సంహరించుకోవాలని , లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపడతామని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, రామ్మోహన్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం స్థానిక ఎం.ఆర్. కళాశాల ఎదురుగా విద్యార్థులతో ధర్నా నిర్వహించారు.
ఎం.ఆర్. కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదన చిలికి గాలివానగా మారకముందే మాన్సాస్ పరిపాలనామండలి సరైన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు ఆశిస్తున్నారు.