ఎమ్మెస్ రాజుకి అభిరుచి కలిగిన నిర్మాతగా మంచి పేరుంది. ‘వర్షం’ .. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా‘ .. ‘దేవీపుత్రుడు’ .. ‘పౌర్ణమి’ వంటి విభిన్నమైన చిత్రాలను నిర్మించిన ఘనత ఆయన సొంతం. ఆయన నిర్మించిన ప్రేమకథలు ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించాయి. అలాంటి ఎమ్మెస్ రాజు .. ఆ తరువాత మెగా ఫోన్ పట్టేసి కూడా లవ్ స్టోరీస్ నే తెరకెక్కించాడు. ‘తూనీగా తూనీగా’ .. ‘వాన’ పేరుతో దర్శకుడిగా ఆయన అందించిన చిత్రాలు అంతగా ఆడలేదు. ఆ తరువాత నుంచి ఆయన సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు.
ఇటీవలే ఆయన దర్శకుడిగా మరో ప్రయోగం చేశారు. ‘డర్టీ హరి‘ అనే పేరుతో ఒక రొమాంటిక్ మూవీని తెరకెక్కించారు. శ్రవణ్ రెడ్డి – సిమ్రత్ కౌర్ జంటగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అవుతుందనీ .. వాళ్లు ఆశించే అంశాలతోనే ఈ కథ నడుస్తుందని విడుదలకి ముందే చెప్పారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త ఓటీటీ ప్లేట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. తొలి రోజు నుంచే భారీ వ్యూస్ ను రాబడుతూ ఈ సినిమా దూసుకుపోతోంది.
తాజా ఇంటర్వ్యూలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. “ఇంతవరకూ నిర్మాతగా .. దర్శకుడిగా నేను చేస్తూ వచ్చిన సినిమాలు వేరు .. ఈ సినిమా వేరు. అయితే ఇందులో రొమాన్స్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉంటాయి అంతే. అయితే కథను బట్టే అలాంటి సీన్స్ ఉంటాయిగానీ, కావాలని ఇరికించినట్టుగా ఉండవు. ఈ తరహా రొమాన్స్ ఆడియన్స్ ఇప్పటివరకూ చూడనిదేమీ కాదు .. అందువలన రొమాన్స్ ను నా స్టైల్లో కొత్తగా ఆవిష్కరించాను. ఇందులో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు .. హార్ట్ ను టచ్ చేసే ఒక పాయింట్ ఉంటుంది. కథలో ఆత్మ లేకుండా నేను ఎప్పుడూ సినిమాలు చేయను.
నిజం చెప్పాలంటే నిర్మాతగా .. దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చింది. ఒక ఏడాది గ్యాప్ వస్తేనే ఎవరైనా మరిచిపోతారు. కానీ అలా మరిచిపోయే సినిమాలు చేయకపోవడం నేను చేసుకున్న అదృష్టం. నా సినిమాలు తరచూ టీవీల్లో వస్తుండటంతో నేను ఆడియన్స్ కి టచ్ లోనే ఉన్నట్టుగా అయింది. అలాంటి పరిస్థితుల్లో నా దర్శకత్వంలో ‘డర్టీ హరి‘ సినిమా చేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు. నాపై .. ఈ సినిమా కథపై వాళ్లకి గల నమ్మకమే అందుకు కారణం. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందనే విషయాన్ని ఈ రోజు వస్తున్న రెస్పాన్స్ ను చూస్తే అర్థమవుతోంది” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- శృంగార భరితంగా చెప్పిన ‘హరి’ కథ (డర్టీహరి రివ్యూ)