తెలంగాణలోని రెండు నగరపాలక సంస్థలు, ఐదు పురపాలక సంఘాలకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకటిరెండు చోట్ల తప్ప..మిగతా చోట్ల ప్రశాంత వాతావరణంలో ఎన్నకలు జరిగాయి. అయితే గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే వరంగల్, ఖమ్మం నగర పాలకసంస్థల్లో ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. కరోనా భయం, మధ్యాహ్నం ఎండతో ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారన్న అంచనాలున్నాయి. సాయంత్రం ఐదు గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 6.3లక్షల మంది ఓటర్లు ఉన్న వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో 54 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో వరంగల్‌లో 62శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి భారీగా తగ్గిందని భావించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఇంకా తుది లెక్కలు రావాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో 59 శాతంగా ఉందని అధికారులు చెబుతున్నారు. నకిరేకల్ మున్సిపాల్టీలో 80 శాతం పోలింగ్ నమోదు కాగా అచ్చంపేటలో 62శాతం, జడ్చర్లలో 59, సిద్దిపేట 69, కొత్తూరులో 80 శాతం నమోదైంది. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, మెట్పల్లి, అలంపూర్, జల్పల్లి, గజ్వేల్, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నికలు జరిగాయి.
వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో..
వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో బీజేపీ కార్యకర్తలు పార్టీ కండువాలతో ఓటు వేసేందుకు వస్తున్నారని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. 16వ డివిజన్‌లోనూ ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ సందర్భంగా డబ్బుల పంపిణీ చేస్తున్నారన్న పరస్పర ఆరోపణలతో టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు ఆందోళనకు దిగాయి. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఖమ్మంలో పలు డివిజన్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.ఈ ఎన్నికల కోసం మొత్తం 1,539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,809 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. అయితే వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల్లో మాత్రం ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పవచ్చు.
మే3న ఫలితాలు.. ర్యాలీలపై నిషేధం
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్లో 59 డివిజన్లు ఉండగా 250 మంది బరిలో నిలిచారు. ఖమ్మం కార్పొరేషన్లో ఇప్పటికే 10 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.సిద్దిపేట పురపాలక సంఘ పరిధిలో 43 వార్డులకు236 మంది పోటీచేస్తుండగా, నకిరేకల్ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు,అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు 66 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 48మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికలకు సంబంధించి మే3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు తర్వాత గెలుపు సంబురాలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలని ఆదేశించారు.
Must Read ;- ఆ రాష్ట్రాల్లో అధికారం వారిదే: ఎగ్జిట్ పోల్స్..