రాంగోపాల్ వర్మ వివాదాల సినిమా ‘మర్డర్’ ఎట్టకేలకు విడుదలైంది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత ప్రణయగాథ నేపథ్యంలో రూపొందే సినిమాగా దీనికి ప్రచారం ఉంది. దీని విడుదలను ఆపటానికి అమృత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. థియేటర్లలోనే విడుదలైంది. పరువు హత్య నేపథ్యంలో రూపొందిన ఈ మర్డర్ ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది అందరికీ తెలిసిన కథే. ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు మాధవరావు, వనజ (శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి) దంపతులు. ఆమె పేరు నమ్రత (సాహితి). అంత గారాబంగా పెరిగిన నమ్రత కాలేజీలో ఓ యువకుడితో ప్రేమలో పడుతుంది. ఆ కుర్రాడి పేరు ప్రవీణ్. తన ప్రేమను తండ్రి ముందు వ్యక్తం చేస్తుంది నమ్రత. ఎంతో గారాబంగా పెంచుకున్న కూతురు ఇలా ప్రేమలో పడడం మాధవరావుకు ఇష్టం లేదు. ఆ ప్రేమను తిరస్కరిస్తాడు.
తన ఆస్తి కోసం ప్రవీణ్ ఆమెను వలలో వేసుకున్నాడని భావిస్తాడు. తండ్రీ కూతుళ్ల మధ్య కోపతాపాలు పెరిగిపోతాయి. దాంతో ఇంట్లో నుంచి పారిపోయి ప్రవీణ్ ను పెళ్లి చేసుకుంటుంది నమ్రత. ఆ పరిస్థితుల్లో ఆ తండ్రి హృదయం ఎంత ఆవేదన చెందిందో చూపించారు దర్శకుడు. తన కూతురి విషయంలో మాధవరావు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? దాని పర్యవసానం ఏమిటి? అనే అంశాలను చూడాల్సిందే.
ఎలా చేశారు? ఎలా తీశారు?
ఇది అందరీకీ తెలిసన కథే అయినా కథనంలో దర్శకుడు తన ప్రత్యేకతను చూపారు. ఇది ఒక్క అమృత, ప్రణయ్ ల కథే అనుకోనవసరం లేదు. ఇలాంటి ప్రేమ కథలు అనేక చోట్ల జరుగుతున్నవే. కాకపోతే తల్లిదండ్రులపై సానుభూతి చూపేలా దర్శకుడు దీన్ని తీర్చిదిద్దాడు. భావోద్వేగాలను బాగా పండించగలిగాడు. ముఖ్యంగా మాధవరావు పక్షపాతిగా వ్యవహరించి కథను నడిపినట్టుంది. ప్రేమికుల వైపు మొగ్గకుండా తల్లిదండ్రుల కోణంలో సినిమా తీశాడు.
ఈ కథకు అదే ప్రాణం పోసిందని అనుకోవాలి. మాధవరావు విలన్ అనుకోవాలా మంచివాడు అనుకోవాలా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మాధవరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ ఈ పాత్రకు ప్రాణం పోశారని అనుకోవచ్చు. ఓ తండ్రి హృదయం ఎంతగా రగిలిపోతుందో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సంఘర్షణను అంత బాగా రక్తి కట్టించగలిగారు. తల్లి పాత్రకు గాయత్రీ భార్గవి కూడా న్యాయం చేశారు.
ఇక నమ్రతగా సాహితి కూడా బాగా నటించింది. ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రీరికార్డింగ్ కూడా బాగా కుదిరింది. సన్నివేశాలకు ఫీల్ తీసుకురావడంలో రీరికార్డింగ్ బాగా తోడ్పడింది. రాంగోపాల్ వర్మ ఇటీవలి చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉందని అనుకోవచ్చు. దర్శకుడిగా అనిల్ చంద్రకు మంచి మార్కులు పడతాయి.
నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ, గిరిధర్, దీపక్, గణేష్ తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: డిఎస్ఆర్ డివోపి: జగదీష్ చీకటి ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
సమర్పణ: రాంగోపాల్ వర్మ
నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి
దర్శకత్వం: ఆనంద్ చంద్ర
బ్యానర్: నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల: 24-12-2020
ఒక్కమాటలో: చూడగలిగేలా తీయగలిగారు
రేటింగ్: 2.5/5
– హేమసుందర్ పామర్తి