‘లవ్ జీహాద్’ ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న సమస్యలలో ఒకటి. పెళ్లి పేరుతో యువతి, యువకులను బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడుతున్నారని వారి ఆరోపణ. కానీ, ఈ విషయం పెళ్లి చేసుకుని, వేధింపులు ఎదురయ్యే వరకు వారికి కూడా అర్థం కావడం లేదు. కొందరు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక పెళ్లిని విచ్ఛిన్నం చేసుకుంటుంటే, మరి కొందరు ఇష్టంతోనే లేక బలవంతంగానో మారిపోతున్నారు. ఇలాంటి సమస్యలు సామాన్యులు మాత్రమే ఎదుర్కొంటున్నారంటే పొరపాటు. ప్రముఖులు సైతం వీటికి అతీతులేమీ కాదు. ఇటీవలే కరోనాతో మరణించిన ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ సతీమణి కమాల్ రుక్ ఖాన్, ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నాని నేటికీ ఎదుర్కోంటున్నానని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అంతే కాదు, బలవంతపు మత మార్పిడిల చట్టానికి తన మద్ధతు ప్రకటించింది.
అందమైన ప్రేమ వివాహాం
నా పేరు కమాల్ రుక్ ఖాన్. ఇటీవల మరణించిన మూజ్యిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ భార్యను. పెళ్లికి ముందు మేము దాదాపు 10 ఏళ్ల పాటు కలిసి ఉన్నాం. చివరికి ఒకరినొకరం అర్థం చేసుకున్నాం అనే నమ్మకం వచ్చాక వివాహాం చేసుకున్నాం. నేను పార్శి కుటుంబానికి చెందిన దానిని. నా భర్త ముస్లిం. కాలేజీ రోజుల్లో మొదలైన మా ప్రేమను పెళ్లితో బంధంగా మార్చుకున్నాం. మేము పెళ్లి తర్వాత ఎవరి మతాలను వారు గౌరవించుకుంటూ బతకాలి అనే కోర్టు యాక్ట్ ద్వారా వివాహాం చేసుకున్నాం. ఇలా చేసుకున్నా కూడా నాకు వేధింపులు తప్పలేదు.
అందుకేనేమో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పెళ్లి-మతమార్పిడి అనే సమస్య నన్ను ఆకర్షించింది. ఈ క్రమంలో నా అనుభవాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. వేరొక మతం వారిని పెళ్లి చేసుకున్న నేను మతం పేరుతో ఎదుర్కోన్న అవమానాలు, సాధింపులు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది కనీసం ఒక్కరికైనా కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాను.
ఆత్మాభిమానమా… మతమా…
నేను ఎంతో స్వతంత్రపు వాతావరణంలో పెరిగాను. కానీ, పెళ్లి తర్వాత పరిస్థితులు చాలా మారాయి. చదువుకుని, స్వతంత్రంగా ఆలోచించే నా విధానాలు అత్తింటి వారికి నచ్చలేదు. దానికి తోడు నన్ను మతం మార్చుకొమ్మని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. నాకు వాళ్లమతాచారాలను పాటించడానికి ఎటువంటి ఇబ్బందిలేదు. కానీ, మతం మార్చుకోవడం అనే విషయాన్ని అంగీకరించలేకపోయాను. అదే నాకు, నా భర్తకు అడ్డుగోడలా నిలిచింది, మా బంధాన్ని మసకబార్చింది. మత మార్పిడికి నా ఆత్మాభిమానం అంగీకరించలేదు. మతాన్ని మార్చుకుంటేనే వాళ్లకు విలువిచ్చినట్లు అవుతుంది అనే దానికి నేను పూర్తి వ్యతిరేకం. నా మనసులో లేని భావాన్ని పైకి నటిస్తూ ఎలా బతకాలి.
విడాకులకు దారితీసింది
మతమార్పిడిని అనే సమస్య మా మధ్య అగాదాన్ని సృష్టించింది. అది మెల్లగా విడాకులు తీసుకునే వరకూ వెళ్లింది. ఆ సమయంలో పిల్లలనైనా స్వతంత్రంగా పెంచాలనుకునే ఆలోచన నన్ను ఇంతటి కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది. వృత్తి పరంగా వాజిద్ చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. కుటుంబానికి ఎంతో విలువనిచ్చే వ్యక్తి కూడా. కానీ మతపరమైన సమస్యలు మమ్మల్ని విడదీశాయి.
నా హక్కుల కోసం పోరాడుతున్నా
ఇటీవల వాజిద్ అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కానీ, అతని మరణం తర్వాత కూడ మమ్మల్ని ఆ కుటుంబం వారు వేధించడం మానలేదు. కానీ, నేను కూడా నిర్ణయించుకున్నాను, వారిని ఎదిరించి నిలవాలని, నా పిల్లలకు చెందాల్సిన హక్కుల కోసం పోరాడాలని. వాళ్లింతలా వేధిస్తుండడానికి కారణం నేను మత మార్పిడికి ఒప్పుకోకపోవడమే. ఆఖరికి వాజిద్ మరణం కూడా వారిలో మార్పు తీసుకురాకపోవడం దురదృష్టకరం.
మతమార్పిడి నిరోధక చట్టం చేయండి
పెళ్లి పేరుతో మతమార్పిడి వేధింపులు ఎదుర్కోంటున్న నా లాంటి మహిళలకు రక్షణ చట్టం కావాలి. మేము నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తున్నందుకు, మమ్మల్ని చెడుగా చిత్రీకరించి కుటుంబం నుండి వెలివేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం నమ్మిన మతాన్ని పాటిస్తూ, ఇతరుల అభిప్రాయాలకు, మతాలను గౌరవించడమే నా దృష్టిలో అసలైన మతం. అందరినీ కాపాడడమే, గౌరవించడమే మతం యొక్క అంతిమ సందేశం. మత సామరస్యాన్ని పాటిస్తూ సంతోషంగా ఉండడమే మతం ఉద్దేశం. అంతేకానీ, మతం పేరుతో కుటుంబాలను విడదీయకూడదు.
లోతుగా ఆలోచించండి
ఈ మత మార్పిడి చట్టం గురించి చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మతమార్పిడి వల్ల ఎక్కువగా బలవుతున్నది ఆడవాళ్లే. మతం పేరుతో వారిని వేధింపులకు గురిచేసి, వారు చెప్పింది వినకపోతే చివరకి వారిని భర్తనుంచి వేరు చేస్తున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలి. తాము నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తూ, అవతలి వారి సిద్ధాంతాలను గౌరవించడమే అసలైన మతం అని తెలుసుకుంటే ఇలాంటి వేధింపులకు స్వస్తి పలకవచ్చు. మతమార్పిడి నిరోధక చట్టం ద్వారా నాలాంటి వాళ్లు ఎందరో వేధింపుల నుండి బయటపడతారు.