సాయి పల్లవి ఏ సినిమా చేసినా అందులో ఓ మెస్మరైజింగ్ పాట లేకపోతే మజా ఉండదు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల సినిమాలో మళ్లీ తళుక్కుమందంటే అలాంటి మెస్మరైజింగ్ పాట లేకుండా ఎలా ఉంటుంది. ఇంతకుముందు ‘ఫిదా’లో వచ్చిందే మెల్ల మెల్లగ వచ్చిందే పాటకు ఎలాంటి స్పందన వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో ప్రేమ కథా చిత్రం ‘లవ్ స్టోరీ’లో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య హీరో. ‘ఫిదా’లో వచ్చిందే పాటలను మధుప్రియ పాడితే ఈసారి శేఖర్ కమ్ముల దృష్టి మంగ్లీ మీద పడినట్టుంది.
సాధారణంగా పాట వినగానే గుర్తుండిపోవాలంటే జానపద బాణీలతోనే సాధ్యం. ఆ తరహాలోనే సుద్దాల అశోక్ తేజతో ఓ పాట రాయించారు శేఖర్ కమ్ముల. ఇందులో ‘సారంగ దరియా’ అనే పల్లవితో సాగే పాటను ఆదివారం హీరోయిన్ సమంత విడుదల చేశారు. సంగీత దర్శకుడు పవన్ బాణీలు సమకూర్చిన ఈ పాట జనంలోకి దూసుకుపోతోంది. ఇది తెలంగాణ జానపదం పాట అని శేఖర్ కమ్ముల వివరించారు. ఈ పాట పిక్చరైజేషన్ కు సంబంధించిన విజువల్స్ చూస్తుంటే మరోసారి మంచి పాటతో సాయి పల్లవి జనం ముందుకు రాబోతున్నట్టు అర్థమవుతోంది.
మంగ్లీ గొంతుకు శేఖర్ మాస్టర్ నృత్యరీతులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇది సేకరణ పాట అని శేఖర్ కమ్ముల చెప్పారు. ‘ఈ పాటను సేకరించి మాకు అందించిన రేలారే ‘కోమల’కు కృతజ్ఞతలు’ అని తెలిపారు. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేయడానికి నిర్ణయించారు. యూట్యూబ్ లో ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.