గన్నవరం విమానాశ్రయం అక్రమ సంపాదన పరులకు అడ్డాగా మారుతోందా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? నిఘా అధికారులు నిద్ర పోతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య ఈ విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆమె ఏపీ ప్రభుత్వంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి భార్య అని తేలింది. ఆమె అనేక సార్లు దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించినట్టు అధికారుల విచారణలో తేలింది. ఇప్పుడు ఈడీ అధికారుల దృష్టి ఈ విమానాశ్రయంపై పడింది. ప్రయాణికులు, లగేజీలపీ ఈడీ అధికారులు ఆరాతీస్తున్నారు. అంతేకాదు ఇక్కడి నుంచి చార్డర్డ్ విమానాల్లో పెద్ద ఎత్తున సూట్ కేసుల్లో నగదు, బంగారం తరలుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమార్కులకు అడ్డాగా గన్నవరం విమానాశ్రయం మారిందని వార్తలొస్తున్నాయి. ఇక్కడ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ ప్రభుత్వ పెద్దల అనుచరుడిదిగా చెబుతున్నారు. ఈ విమానాశ్రయం నుంచి తరచూ ఢిల్లీకి వెళ్లే చార్టర్డ్ విమానాల్లో పెద్ద ఎత్తున్న అక్రమ సొమ్ము తరలుతోందని సమాచారం. ఇది ఎవరి ప్రయోజనాల కోసం వెళుతోంది? హవాలా నెట్ వర్క్ లో ఇది భాగమా? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కేంద్ర సాయుధ బలగాల నిఘా ఉంటుంది. కానీ రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ కాపలా బాధ్యతలు ఎందుకు చూస్తోందన్నది మరో కీలక అంశం. సరైన నిఘా లేకపోవడంతో ప్రతి నెలా కనీసం 15 చార్టర్డ్ విమానాలు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళుతున్నాయన్నది సమాచారం.
పెద్ద ఎత్తున సూట్ కేసులు వెళుతున్నా వాటిని సరిగా తనిఖీ చేయడం లేదని తెలుస్తోంది. ఆ సూట్ కేసులు ఎవరి కోసం, ఎక్కడికి వెళుతున్నాయన్నది పెద్ద మిస్టరీ. ఆ సూట్ కేసులు తీసుకు వెళ్లిన వ్యక్తులు తిరిగి వట్టి చేతులతోనే వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా గన్నవరం విమానాశ్రయంలో జరిగే మిస్టరీని ఛేదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏంచేస్తారో చూడాలి. ఎప్పుడూ లేనిది గన్నవరం విమానాశ్రయం ఈసారి తరచూ ఇలాంటి అంశాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. అక్రమార్కుల అడ్డాగా ఈ విమానాశ్రయం మారిందని అంటున్నారు. ఈ అడ్డా వెనుక ఎవరి అండదండాలున్నాయో, ఇది ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.