రేణిగుంటలో దారుణం..
చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటుచేసుకుంది. భర్త తలను అతి కిరాతంగా నరికి, ఆ తలను బ్యాగ్ లో పెట్టుకుని అర్బన్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయింది భార్య! రేణిగుంట, బుగ్గవీధిలో నివాసం ఉండే రవిచందర్(55), వసుంధర దంపతులకు తరచూ గొడవలు జరుగుతాయని స్థానికులు ద్వారా తెలుస్తోంది. వీరికి 20 సంవత్సరాల వయస్సున్న ఒక కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర తన భర్తను విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసింది. కిరాతంగా మొండెం నుంచి తలను వేరు చేసింది. అనంతరం ఆ తలను బ్యాగ్ పెట్టుకుని, రోడ్డుపై నడుచుకుంటూ రేణిగుంట అర్బన్ పోలీసు స్టేషన్ వెళ్లింది. అక్కడున్న పోలీసులకు విషయం చెప్పి, తలను పోలీసుల ఎదుట పెట్టింది. అది చూసిన పోలీసులు కంగుతిన్నారు.
నా భర్తను నేనే చంపా..
తన భర్తను తానే చంపానని భార్య వసుంధర పోలీసుకు చెప్పింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన రేణిగుంట పోలీసులు ఆమెను వెంట పెట్టుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ రక్తమడుగులో ఉన్న వసుంధర భర్త రవిచంద్ర మృతదేహాన్ని గుర్తించారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు. ఈ ఘటనపై స్థానికులను పోలీసులు విచారించగా.. వసుంధర మానసిక పరిస్థితి సరిగా ఉండదని, నిత్యం గొడవులు పడుతూ ఉంటారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.