ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని నటుడు, నిర్మాత నాగబాబు ప్రకటించారు. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలల క్రితమే ప్రకాష్ రాజ్ తనను కలిసి ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కి ఓ భవనం ఉంటే బాగుంటుందన్నారు. ఆ భవనం నిర్మించడానికి, మా అసోసియేషన్ ను పారదర్శకంగా నడపడానికి తన వద్ద ఓ ప్రణాళిక, కార్యాచరణ ఉందన్నారు. ప్రకాష్ రాజ్ వివిధ భాషల్లో నటించారు. ఆయన సమర్ధుడు. తెలంగాణలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నారు.
ఆయనకు సామాజిక సేవా గుణం ఎక్కువ. మా అధ్యక్ష పదవికి కావాలసిన అర్హతలు ఆయనకు ఉన్నాయి. ఈ అసోసియేషన్ ను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్న సంకల్పంతో ఆయన పనిచేస్తారన్న నమ్మకం ఉంది’ అన్నారు. ఆయనను నాన్ లోకల్ అంటున్నారు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది ఏమీ ఉండదు. మనమందరం ఇండియన్స్ మే. అమెరికాలో ఉన్నవారికి కూడా కొన్నాళ్ళకు అక్కడ పౌరసత్వం వస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో మూడు గ్రామాలను దత్తత తీసుకొని సేవ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఎక్కడ పుట్టారన్నది అనవసరం.
ఆయన తెలుగులోనే నటుడిగా స్థిరపడ్డారు. ఒక సమర్ధవంతమైన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ కి నా మద్దతు ప్రకటిస్తున్నా. అలాగే అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు కూడా ప్రకాష్ రాజ్ కు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ‘మా’ పనితీరు బాగోలేదు. దాని ప్రతిష్ట మసకబారింది. ‘మా’ అసోసియేషన్ కు గౌరవం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అందుకే మా మద్దతు ప్రకాష్ రాజ్ కి ఉంటుంది’ అని నాగబాబు వివరించారు. నాగబాబు ప్రసంగాన్ని బట్టి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వినోదాన్ని పంచిన బండ్ల గణేష్
బండ్ల గణేష్ నోరు విప్పితే చాలు ఏదో ఒక పంచ్ పేలుతుంది. ఈరోజు కూడా అలాగే జరిగింది. ముఖ్యంగా బండ్ల గణేష్ తో పొగిడించుకోవాలన్న కోరిక చాలా మందిలో ఉంటుంది. ఈసారి బండ్ల గణేష్ పొగడ్తలు ప్రకాష్ రాజ్ కు దక్కాయి. ‘ప్రకాష్ రాజ్ అన్నతో నాకు 23 ఏళ్లుగా పరిచయం ఉంది, ఎఆయన నాకెంతో ఆప్తుడు. ఆయనకు మా ఏరియాలో పదెకరాలు నేనే కొనిపెట్టాను. ఆ పొలాల్లో ఫామ్ హౌస్ నిర్మించి ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో అనేక మందికి తన సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తున్నారు. వారికి భోజనం ఏర్పాట్లు చేశారు.
అనేక మంది పేద కళాకారుల పిల్లల చదువులకూ, పెళ్లిళ్లకూ లక్షల్లో ఖర్చుచేస్తున్నారు. మా సభ్యులంతా ఒక్కటే, మా మధ్య కులమత భేదాల్లేవు. నాన్ లోకల్ అనే ఫీలింగ్ అసలే లేదు. ఇక్కడ పుట్టిన ప్రభాస్ దేశాన్ని ఏలుతున్నాడు. రాజమౌళితో ఇంగ్లీషు వాళ్ళు సినిమా చేయాలని అడుగుతున్నారు. కాబట్టి ప్రతిభ అన్నది ముఖ్యంగానీ లోకల్ నాన్ లోకల్ అనే భేదాలు ఉండవు. ప్రకాష్ రాజ్ మా పదవిని చేపడితే పేద కళాకారులకు ఉపాధి, వైద్యం, విద్య విషయంలో సహాయపడతారు.
గతంలో ఈ పదవులు చేపట్టినవారు కూడా బాగా చేశారు. వారి కంటే మెరుగ్గా ప్రకాష్ రాజ్ చేస్తారనే భావిస్తున్నా. మా వెనుక పెద్దపెద్ద వాళ్ళు ఉన్నారు.’ అంటూ బండ్ల గణేష్ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ పెద్ద వాళ్లు మెగా హీరోలేనన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. ఈ ప్యానల్ లో ఉన్న సాయి కుమార్, జయసుధ మీడియా సమావేశానికి రాకపోయినా వీడియో బైట్ పంపించారు. నటుడు శ్రీకాంత్, ఉత్తేజ్, సమీర్, సురేష్ కొండేటి, అదిరే అభి, ఆదర్శ్ తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Must Read ;- ప్రకాష్ రాజ్ సినిమా బిడ్డల ప్యానెల్