తన బ్యానర్ పై రొటీన్ సినిమాలు రావని, ఏదో ఒక కొత్తదనం ఉంటుందని గతంలోనే ప్రకటించాడు నాని.
ఆ మాటకు తగ్గట్టుగానే తాజాగా మరో డిఫరెంట్ మూవీ స్టార్ట్ చేశాడు.
వాల్ పోస్టర్ సినిమా.. నాని స్థాపించిన బ్యానర్ ఇది. ఇప్పుడీ బ్యానర్ పై మరో సినిమా లాంఛ్ అయింది.
సినిమా పేరు మీట్ క్యూట్. నాని బ్యానర్ పై రాబోతున్న నాలుగో సినిమా ఇది. గత సినిమాల్లానే ఈ సినిమా
కూడా చాలా విభిన్నంగా ఉంటుందని నాని సగర్వంగా ప్రకటించాడు.
అన్నింటికంటే హైలెట్ ఏంటంటే.. నాని చెల్లెలు దీప్తి ఈ సినిమాతో దర్శకురాలుగా పరిచయమౌతోంది. ఈ సినిమాకు కథ కూడా ఆమే రాసుకుంది. అంటే ఇందులో కచ్చితంగా నాని హ్యాండ్ కూడా ఉందనే అనుకోవాలి. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇదొక మల్టీస్టారర్. కాకపోతే హీరోల మల్టీస్టారర్ కాదు. హీరోయిన్ల మల్టీస్టారర్. ఫిమేల్ ఓరియంటెడ్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలామంది హీరోయిన్లు కనిపిస్తారట. ఇక ఓ కీలక పాత్రలో సత్యరాజ్ కనిపించబోతున్నాడనే విషయం లాంఛింగ్ తో రిలీజ్ చేసిన స్టిల్ లోనే తెలిసిపోయింది.
కొత్త బ్యానర్ స్థాపించినప్పుడే నాని ఓ మాట అన్నాడు. కొన్ని కథలు తనకు బాగా నచ్చుతాయని, కానీ అలాంటి కథల్ని సినిమాలుగా తీయడానికి నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రారని చెప్పుకొచ్చాడు. అలాంటి కొత్త కథల్ని, కొత్త కథనాన్ని పరిచయం చేయడానికే తను బ్యానర్ పెట్టానని చెప్పిన నాని.. చెప్పినట్టుగానే తొలి చిత్రం ”అ!”తో ఆకట్టుకున్నాడు. ఓ విలక్షణమైన కథ, కథనాన్ని పరిచయం చేశాడు.
ఇక రెండో ప్రయత్నంగా నాని బ్యానర్ పై వచ్చిన సినిమా హిట్. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమా నిజంగానే హిట్టయింది. విశ్వక్ సేన్ కు ఓ సక్సెస్ అందించడంతో పాటు నాని బ్యానర్ కు ఓ మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది కూడా డిఫరెంట్ స్టోరీనే. ప్రస్తుతం తన బ్యానర్ పై మూడో చిత్రంగా హిట్ సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడు నాని. అది కూడా సరికొత్త కథాంశమే.
ఈ సంప్రదాయన్ని కొనసాగిస్తూ.. మరో డిఫరెంట్ స్టోరీతో వస్తోంది మీట్ క్యూట్. స్వయంగా నాని సిస్టర్ దీప్తి ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం, కథలో నాని కూడా ఓ చేయి వేశాడంటే ఈ సినిమా ఎంత కొత్తగా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికైతే సినిమాను లాంఛ్ చేశారు. 2 స్టిల్స్ రిలీజ్ చేశారు. అంతకుమించి వివరాలు పెద్దగా బయటకు రాలేదు. ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు పెద్ద హీరోయిన్లు నటిస్తారనే టాక్ మాత్రం మొదలైంది.
Must Read ;- ‘జాతిరత్నాలు’ సీక్వెల్ కు రంగం సిద్ధం











