ఈ తరం ప్రేక్షకుల్ని మెప్పించాలంటే.. ఎంపిక చేసుకొనే కథలు ఇన్నోవేటివ్ గా ఉండాలి. యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలివ్వాలి. సీనియర్ డైరెక్టర్స్ ను అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉండాలి. ఈ మధ్యకాలంలో ఫేస్ చేసిన చేదు అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని నేచురల్ స్టార్ నానీ.. ఈ తరహా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్పు మంచిదే.. మారుతున్న కాలంతో పాటు.. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా వెళితేనే ఫలితముంటుందని నానీ ఇప్పటికైనా తెలుసుకోవడం మంచిదేనని అంటున్నారు. ప్రస్తుతం నానీ లైనప్ చూస్తుంటే.. ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రస్తుతం కొందరు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ తో నానీ వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టుకోవడం ఆసక్తిని రేపుతోంది.
ప్రస్తుతం నానీ చేస్తున్న ‘టక్ జగదీష్’ సినిమాకి దర్శకుడు శివ నిర్వాణ. గతంలో నానీతో నిన్నుకోరి చేసిన డైరెక్టరే ఇతడు. అలాగే.. చైతూ, సమంతలతో ‘మజిలీ’ సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు శివ. ఇక దీని తర్వాత నానీ చేయబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీని కూడా యంగ్ డైరెక్టరే తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండతో టాక్సీవాలా తీసిన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే.. గతంలో శ్రీవిష్ణుతో ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ లాంటి యూత్ ఫుల్ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా నానీ ఒక సినిమా చేస్తున్నాడు.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి ఇంటెలిజెంట్ థ్రిల్లర్ తెరకెక్కించిన స్వరూప్ ఆర్.యస్.జే దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి కమిట్ మెంట్ ఇచ్చాడట నానీ. ప్రస్తుతం ఈ దర్శకుడు ఒక బౌంటీ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకా నానీ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు స్వరూప్. వరుసగా ఇంత మంది యంగ్ డైరెక్టర్స్ తో పనిచేస్తున్న నానీ.. తిరిగి ఫామ్ లోకి రావాలనుకుంటున్నాడు. వీటిలో ముందుగా టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు నానీ. మరి ఈ సినిమాలతో నానీ ఏ రేంజ్ లో తిరిగి ఫామ్ లోకొస్తాడో చూడాలి.