బోయ్ నెక్స్ట్ డోర్ పాత్రల్లో జీవించడం వల్లనే నానీకి నేచురల్ స్టార్ అనే బిరుదును తగిలించారు టాలీవుడ్ ప్రేక్షకులు. కంటెంట్ ఏమీ లేకపోయినప్పటికీ దాన్ని చక్కటి కామెడీ టైమింగ్ తో, సహజమైన నటనతో కవర్ చేయడం నానీ గొప్పతనం. సాధారణమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాల్ని సైతం తన అసాధారణమైన యాక్టింగ్ టాలెంట్ తో నిలబెట్టిన సందర్భాలున్నాయి. లవ్ స్టోరీస్ కు, కామెడీ ఎంటర్ టైసర్స్ కు నానీ పెర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. అయితే ఈ స్టైల్ నుంచి నానీ బైటికెళితే మాత్రం అతడికి చేదు అనుభవమే ఎదురవుతుందని రీసెంట్ మూవీ ‘వి’ నిరూపించింది.
అందులో నెగెటివ్ షేడ్స్ తో కనిపించి.. యాక్షన్ ఇమేజ్ తెచ్చుకోవడనికి ప్రయత్నించడమే పొరపాటైంది. అందుకే నానీ .. ఇకపై అలాంటి ప్రయోగాల జోలికి పోకుండా.. తన ప్రధాన బలమైన కామెడీ ఎంటర్ టైనర్స్ లోనూ, సరదా ప్రేమకథా చిత్రాల్లోనూ నటించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే నానీకి సెంటిమెంట్ మూవీస్ కూడా బాగా వర్కవుట్ అవుతాయని ‘జెర్సీ’ లాంటి సినిమా నిరూపించింది. అందులో తండ్రీ కొడుకుల ఎమోషన్స్ ను హైరేంజ్ లో ఆవిష్కరించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.
ఈ సినిమా తెచ్చిపెట్టిన ధైర్యంతోనే .. నానీ ఇప్పుడు మరోసారి సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. సినిమా పేరు ‘టక్ జగదీష్’. టైటిల్ లో మోడ్రన్ టచ్ కనిపిస్తున్నా.. ఇదో పక్కా ఎమోషనల్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే .. మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు నానీ. ‘నిన్నుకోరి, మజిలీ’ సినిమాలతో సెంటిమెంట్ ను పుష్కలంగా పండించిన శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకుడు. ఇది అన్నదమ్ముల ఇగో క్లాషెస్ నేపథ్యంలో తెరకెక్కే సినిమా అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా స్టోరీ లైన్ గతంలో శోభన్ బాబు, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి తెరకెక్కించిన హిట్ మూవీ ‘బలరామకృష్ణులు’ ను పోలి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో నిజా నిజాలేంటో తెలియదు కానీ.. సెంటిమెంట్ మాత్రం సినిమా రేంజ్ లోనే ఉంటుందని టాక్. తండ్రి ఒకడైనా.. వేరు వేరు తల్లులకు జన్మించిన ఇద్దరు సవతి సోదరుల కథగా ‘బలరామకృష్ణులు’ తెరకెక్కింది. ఇందులో శోభన్ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఒక దశలో ఆయన పాత్ర విలన్ ను తలపిస్తుంది. సరిగ్గా అలాంటి పాత్రనే ‘టక్ జగదీష్’ లో జగపతిబాబు పోషిస్తున్నాడని తెలుస్తోంది. నానీకి, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయట.
అంతేకాదు ఇందులో నానీ పాత్ర బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతుందట. అంటే.. అతిగా బాధపడడం.. అతిగా ఆనందించేయడం చేస్తుందట ఆ పాత్ర. అది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని, అదే టైమ్ లో ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా ఎంతో కదలిస్తుందని చెబుతున్నారు. ఇదివరకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్నుకోరి మూవీలో నటించాడు నానీ. అది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. అందులోని నానీ పాత్రకు మంచి పేరొచ్చింది. సో. ఈ మూవీకూడా నానీ కెరీర్ లో లాండ్ మార్క్ మూవీ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. చూద్దాం.. ఇందులో నానీ నటన ఏ రేంజ్ లో ఉంటుందో..