CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు పురస్కరించుకుని అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం రూ.76 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు, అన్నం పెట్టే కన్నతల్లిని తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి కొనియాడారు. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీసులో విరాళానికి సంబంధించిన చెక్కును అన్న క్యాంటీన్ల CEOకు ఆమె స్వయంగా అందజేశారు.
చంద్రబాబు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు పండుగ వాతావరణం నెలకొనేలా భువనేశ్వరి ఈ విరాళం ఇచ్చారు. ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 269 అన్న క్యాంటీన్లలో పేదలకు, సామాన్యులకు పూర్తి ఉచితంగా భోజనం అందించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి పుట్టినరోజున రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నదే తన ఆకాంక్ష అన్నారు భువనేశ్వరి.
అన్న క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను భువనేశ్వరి ప్రశంసించారు. పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా ఈ క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, చంద్రబాబు పుట్టినరోజున ఈ సేవలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. NTR ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన భువనేశ్వరి, ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకానికి అండగా నిలవడం గమనార్హం.
ఈ విరాళం ద్వారా ఏప్రిల్ 20న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న అన్న క్యాంటీన్లలో ఉచిత భోజన వితరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. సీఎం బర్త్ డేను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం పట్ల పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.











