తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. గురువారం ఉదయం జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను వైసీపీ నేతలు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. తమ మరో సోదరుడి మరణం నేపథ్యంలో దశదిన కర్మల నిమిత్తం శ్మశానానికి వెళ్లి వస్తున్న క్రమంలో వడ్డు సోదరులపై విరుచుకుపడిన వైసీపీ హంతకులు వారిని దారుణంగా హతమార్చారు. తొలుత కారుతో వారిని ఢీకొట్టిన దుండగులు.. ఆపై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో అత్యంత పాశవికంగా దాడికి దిగారు. ఈ దాడిలో వడ్డు సోదరులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో వడ్డు సోదరుల సమీప బంధువులు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేసు నమోదులోనూ జాప్యమే
వడ్డు సోదరుల దారుణ హత్య నేపథ్యంలో పెసరవాయి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు తొలుత ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు విషయంలో తీవ్ర విమర్శలు రేకెత్తిన నేపథ్యంలో వడ్డు ప్రతాప్ రెడ్డి భార్య ఫిర్యాదుతో చాలా ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తముందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. మొత్తంగా టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతల హత్య నేపథ్యంలో కర్నూలు జిల్లాలోనే కాకుండా యావత్తు ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వడ్డు సోదరుల కుటుంబాలకు అండగా లోకేశ్
ఇలాంటి నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు నారా లోకేశ్ రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణుల సంక్షేమంపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తున్న లోకేశ్… వడ్డు సోదరుల మృతిపై కూడా చాలా వేగంగానే స్పందించారు. అంతేకాకుండా వడ్డు సోదరుల కుటుంబాలకు బాసటగా నిలవాలని భావించిన ఆయన… కాసేపటి క్రితం కర్నూలు జిల్లా పెసరవాయి చేరుకున్నారు. నేరుగా వడ్డు సోదరుల ఇంటికి వెళ్లిన లోకేశ్… వడ్డు సోదరులకు నివాళి అర్పించారు. మరికాసేపట్లో జరగనున్న వడ్డు సోదరుల అంత్యక్రియల్లో లోకేశ్ స్వయంగా పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే… వడ్డు సోదరుల హత్య నేపథ్యంలో పెసరవాయి వెళ్లిన లోకేశ్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు యత్నించారు. అయితే లోకేశ్ పార్టీ శ్రేణులను వారించి తాను పార్టీ నేతలకు నివాళి అర్పించడానికి వచ్చానని, ఈ తరహా స్వాగత సత్కారాలు అవసరం లేదని సున్నితంగా తిరస్కరించారు. మన పార్టీ నేతలు హత్యకు గురైన సమయంలో ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని, ఇలాంటి సంబరాలకు దూరంగా ఉండాలని లోకేశ్ వారికి చెప్పారు. దీంతో పార్టీ కార్యకర్తలు కూడా మిన్నకుండిపోయారు.
Also Read ;- కుటిల యత్నంతో కూల్చివేతలు.. టీడీపీ నేతల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా..
వడ్డీతో సహా చెల్లిస్తాం
వడ్డు సోదరులకు నివాళి అర్పించిన లోకేశ్.. ఆ తర్వాత ఆ నేతల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన లోకేశ్… జగన్ సర్కారు తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీకి అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికేనని, అయితే ఆ పనిని పక్కనపెట్టిన జగన్ రెడ్డి… రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్న జగన్ అండ్ కో… వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డిని, వైసీపీ నేతలను… రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు, అధికారులకు తగిన గుణపాఠం చెబుతామని లోకేశ్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది టీడీపీనేనని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న అన్ని ఘటనలకు వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కూడా లోకేశ్ చెప్పారు.
జగన్ రెడ్డి… ఫ్యాక్షన్ రెడ్డి అని తేలిపోయింది
రెండేళ్ల పాలనలోనే జగన్ అసలు రంగు ఏమిటో బయటపడిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే… జగన్ రెడ్డి మాత్రం ప్రతీకారం, విద్వేషం, విధ్వంసం, దాడులు హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీంతో జగన్ రెడ్డి కాస్తా ఫ్యాక్షన్ రెడ్డి అని తేలిపోయిందని లోకేశ్ ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రెడ్డిగా మారిపోయిన జగన్ రెడ్డి… రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీని బీహార్ లా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో చంద్రబాబు నీరు పారిస్తే… జగన్ రెడ్డి రక్తం పారిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో సీమకు కంపెనీలు, ప్రాజెక్టులు వస్తే… ఫ్యాక్షన్ రెడ్డి పాలనలో కత్తులు, గన్నులతో ఫ్యాక్షనిస్టులు ఎంట్రీ ఇస్తున్నారన్నారు. ఫ్యాక్షన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండీ ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచించలేదనీ…24 గంటలూ ప్రతిపక్ష పార్టీ నాయకుల పై దాడులు,అరెస్టులు,హత్యలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాగుతున్నారని ఆరోపించారు. ఫ్యాక్షన్ రెడ్డి రెండేళ్ల పాలనలో టీడీపీ శ్రేణులపై1400 మేర దాడులు జరిగాయని, అత్యంత కిరాతకంగా 27 మందిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన టిడిపి నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారని, బనగానపల్లె లో మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డిపై నమోదు చేసిన కేసే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
పక్కాగానే దాడి, ఆపై హత్యలు
పాణ్యం నియోజకవర్గం పెసరవాయిలో టీడీపీ నేతలు… గ్రామ మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర రెడ్డిని, ఆయన సోదరుడు, గడివేముల మాజీ సహకార సంఘం ప్రెసిడెంట్ వడ్డు ప్రతాప్ రెడ్డి గారిని వైకాపా ఫ్యాక్షనిస్టులు అత్యంత దారుణంగా హత్య చేసారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఫ్యాక్షనిస్టులు శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, దామోధర్ రెడ్డి లు 15 మంది అనుచరులతో రెండు వాహానాల్లో వచ్చి వడ్డు సోదరులను వెనుక వైపు నుండి ఢీ కొట్టారని వివరించారు. క్రింద పడిన వడ్డు సోదరులపై శ్రీకాంత్ రెడ్డి, రాజారెడ్డి, దామోధర్ రెడ్డి లు తమ అనుచరులతో కలసి వేట కొడవళ్లు, గొడ్డళ్లతో మూకుమ్మడిగా దాడి చేసి నరికారన్నారు. దాడిలో ఇద్దరు అన్నదమ్ములు నాగేశ్వర రెడ్డి, ప్రతాప్ రెడ్డి లు అక్కడికక్కడే మృతి చెందారని, దాడిలో గాయపడిన నాగేశ్వర్ రెడ్డి, సుబ్బా రెడ్డి, వెంకటేశ్వర్లులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు అడ్డుపడ్డారనే కక్షతో ఈ దాడికి దిగారన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నుండి తమకు ప్రాణ హాణి ఉందని,తమకు రక్షణ కల్పించాలని అనేక సార్లు వడ్డు సోదరులు పోలీసులను కోరినా పట్టించుకోలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉందని చెప్పి రివాల్వర్ ను పోలీసులు సరెండర్ చేసుకున్నారన్నారు. ఎన్నికలు ముగిసినా… నాగేశ్వర్ రెడ్డికి ప్రాణ హానీ ఉందన్నా… లైసెన్స్ రివాల్వర్ ను ఇప్పటి వరకు పోలీసులు ఇవ్వలేదన్నారు. దీంతో ఈ హత్యలు పక్కా ప్లానింగ్ తోనే జరిగాయని లోకేశ్ ఆరోపించారు. దాడి జరిగిన ప్రాంతంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నాయని, .దాడి మొత్తం రికార్డ్ అయ్యిందని.అయినా ఇప్పటివరకూ ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదని ఆరోపించారు.
రాజారెడ్డి రాజ్యాంగానికి బానిసలుగా పోలీసులు
వైకాపా యూనిఫామ్ వేసుకున్న కొంతమంది పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగానికి బానిసలుగా మారారని లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఫ్యాక్షనిస్టులు హత్యలు చేస్తే వైకాపా యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అది హత్య కాదు.. ఆత్మహత్య అంటారని…వైకాపా రౌడీలు దాడి చేస్తే అది దాడి కాదు వాళ్లకు వాళ్లే కొట్టుకున్నారని అంటారని ఆరోపించారు. అసలు ప్రాధమిక విచారణ కూడా జరపకుండానే ఫ్యాక్షన్ హత్య కాదు,రాజకీయ కోణం లేదు వ్యక్తిగత కక్షలే అని కేసుని నీరుగారుస్తారని లోకేశ్ దుయ్యబట్టారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులు… అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఫ్యాక్షన్ రెడ్డి గ్యాంగులకు అండగా ఉండి వారిని కాపాడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని… ఖచ్చితంగా చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పద లోకేశ్ హెచ్చరించారు.
దమ్ముంటే నాపై కేసులు పెట్టండి
వైసీపీ సర్కారుకు దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని లోకేశ్ సవాల్ విసిరారు. అధికారం ఉన్నప్పుడు తాము ఇలాగే ప్రవర్తిస్తే వైసీపీ ఎక్కడ ఉండేదో ఒక్క సారి ఆలోచించుకోవాలని జగన్ కు సూచించారు. ఫ్యాక్షన్ రెడ్డి గీత దాటారని…. దీనికి అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ చెప్పారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు అన్నీ మర్చిపోయి అభివృద్ధి అంటూ పరిగెడితే… బెంగుళూరు ప్యాలస్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు అనే ఆలోచనలో ఫ్యాక్షన్ రెడ్డి ఉన్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ఈ సారి అలా ఉండదని, ఫ్యాక్షన్ రెడ్డి సరదా తీరిపోయేలా చేస్తామని లోకేశ్ హెచ్చరించారు. ఫ్యాక్షన్ రెడ్డి అండగా ఉన్నాడని వైకాపా నాయకులు రెచ్చిపోతే ఎవ్వరిని వదలేది లేదని, చేసిన ప్రతి దాడి, హత్యల్లో భాగస్వామ్యం అయిన అందరూ శిక్ష అనుభవించేలా చేస్తామని తేల్చి చెప్పారు. గ్రామాలలో శాంతి నెలకొల్పడానికి,స్నేహపూర్వక వాతావరణం కల్పించడానికి తెలుగుదేశం ఎప్పుడూ సిద్ధమేనని లోకేశ్ చెప్పుకొచ్చారు. అలా కుదరదంటే… ఫ్యాక్షన్ ని నమ్ముకున్న వాడు ఫ్యాక్షన్ లోనే పోతాడనే సత్యాన్ని అందరూ గుర్తుంచుకోవాలని లోకేశ్ సూచించారు.
Must Read ;- టీడీపీ నుంచి పోటీచేసినందుకు దాడి,అక్రమ కేసు.. పోలీస్ స్టేషన్ ఎదుట గర్భణి ఆందోళన