నారా లోకేష్ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి క్యూ కడుతున్న పెట్టుబడుల విషయంలో గానీ లోకేష్ తన సత్తా నిరూపించారు. ప్రత్యేకంగా ఏపీకి గూగుల్ పెట్టుబడి తీసుకురావడం లోకేష్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకువచ్చింది. దీంతో ప్రధాని మోదీ సైతం లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు. లోకేష్‌ను కలిసిన ప్రతీ సందర్భంలో తన అభిమానాన్ని చాటి చెప్పారు మోదీ.
ఈ నేపథ్యంలోనే లోకేష్‌కు మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పింది NDA కూటమి. ఇప్పుడు బిహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో NDA కూటమి తరపున లోకేష్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ బిహార్ వెళ్లనున్న లోకేష్..ఆదివారం అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. కల్యాణదుర్గం పర్యటన అనంతరం బిహార్ రాజధాని పట్నాకు వెళ్లనున్న లోకేష్..బిహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొంటారు. తర్వాత బిహార్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై NDA కూటమి విధానాలను వివరిస్తారు. ఆదివారం పట్నాలో NDA అభ్యర్థులకు మద్దతుగా ప్రెస్‌మీట్ నిర్వహిస్తారు. తర్వాత పట్నా నుంచి తిరిగి విజయవాడకు చేరుకుంటారు.
గూగుల్ ఒప్పందంతో వచ్చిన ఈ గుర్తింపును లోకేష్ తన జాతీయ రాజకీయ ప్రయాణానికి తొలి మెట్టుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం NDA కూటమిలో తెలుగుదేశం పార్టీ, జేడీయూ కీలకంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలే NDA కూటమిలో ఇప్పుడు మూల స్తంభాలు. బిహార్‌లో ప్రచారం ద్వారా, లోకేష్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా NDA అజెండాను ముందుకు తీసుకెళ్లగల నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం లభించింది. ఈ ప్రచార అనుభవం ఆయన జాతీయ రాజకీయ పరిజ్ఞానాన్ని, కూటమిలో ఆయన పాత్రను మరింత పెంచుతుంది.
యంగ్ అండ్ డైనమిక్ ఇమేజ్ –
గూగుల్ పెట్టుబడితో లోకేష్ ఒక్కసారిగా దేశమంతా ఏపీ వైపు చూసేలా చేశారు. అంతేకాదు, పాలనలో టెక్నాలజీని ఉపయోగిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. గూగుల్ పెట్టుబడుల ప్రకటన సందర్భంగా, కర్ణాటక ఐటీ మినిస్టర్‌కు లోకేష్ ఇచ్చిన కౌంటర్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటనలు లోకేష్‌ను కేవలం రాజకీయ వారసుడిగానే కాదు..కఠినమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోగల యంగ్ అండ్ డైనమిక్ నేతగా చూపిస్తున్నాయి. NDA కూటమిలో తండ్రి చంద్రబాబుతో పాటు లోకేష్‌కు సైతం క్రమంగా ప్రాధాన్యత పెరుగుతోంది. దేశ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించడం ద్వారా, లోకేష్ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంలో లేదా ఎన్డీయే కూటమిలో మరింత కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ జాతీయ స్థాయి గుర్తింపు, పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం, రాజకీయ చతురత ఇవన్నీ కలగలిసి… లోకేష్‌ను రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో చక్రం తిప్పే యువ నేతగా మారుస్తాయనడంలో సందేహం లేదు











