ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వంలో టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తన మార్క్ పాలనను ప్రారంభించారు. తాను హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగానే ఉంటానని.. తన పర్యటనలోనూ అటువంటివి ఉండకుండా చూడాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత నారా లోకేష్ పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. రాజకీయ ప్రకటనలు చేయడం.. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చేయకుండా రాష్ట్రంలోని పరిస్థితులకి అనుగుణంగా పాలనను కొనసాగిస్తున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్బంలో మాత్రం వారికి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకి మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ పాలనలో జరిగిన హ*త్యాచారాలు, హ*త్యలపై ఏనాడు స్పందించని మీరు ఇప్పుడు శాంతి భద్రతలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు మంత్రి లోకేష్.
జగన్ ఎక్స్ పోస్టుకి స్పందిస్తూ.. మీ ఐదేళ్ల పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హ*త్యకు గురయ్యారు… మరో 30 వేల మంది అదృశ్యమయ్యారు. ఒక్కసారైనా వాటిపై సమీక్షించారా? కనీసం ఖండించారా? ఏ ఒక్క బాధిత కుటుంబానైనా పరామర్శించారా? అని మంత్రి నారా లోకేశ్ నిలదీశారు. సొంత బాబాయ్‌ని చంపేసినప్పటికీ పట్టించుకోని రాక్షసుడివి.. అలాంటి మీరు నేడు శాంతిభద్రతల గురించి ఎలా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘ఇదేమి రాజ్యం?’ అని ఎక్స్‌లో జగన్ చేసిన పోస్టుపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పునాదులే నేరాలు-ఘోరాలని మీ కుటుంబసభ్యులే చెప్పారని.. ఐదేళ్లపాటు గంజాయి, మాదకద్రవ్యాల్ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు.
బాబాయ్ హ*త్య కేసులో అవినాష్‌రెడ్డిని కాపాడటమే కాకుండా.. దళితుడి హ*త్య కేసులో నిందితుడైన మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. అలాంటి మీరు శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారా? అని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అంతే కాకుండా మీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఐదుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అ*త్యాచారం చేశారు.. అంతెందుకు మీ ఇంటికి సమీపంలోని సీతానగరంలో యువతిపై అ*త్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. అటువంటి మీకు శాంతి భద్రతలపై మాట్లాడే అర్హత ఉందా జగన్?’ అని లోకేశ్ ప్రశ్నించారు.
మీ మైసీపీ ప్రభుత్వ హయాంలో 192 మంది ఎస్సీలు, 58 మంది ఎస్టీలు హ*త్యకు గురయ్యారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్రంలో లేని దిశ చట్టం ఉన్నట్టు ప్రచారం చేశారు.. చట్టంలో లోపాలున్నాయని.. ఈ చట్టాన్ని కేంద్రం తిప్పి పంపితే ఆ తర్వాత దాని గురించి ఎందుకు పట్టించుకోలేదని జగన్‌ని ప్రశ్నించారు. ఆడబిడ్డలపై అ*త్యాచారం చేస్తే ఉరిశిక్ష వేస్తామని చెప్పిన మీరు .. ఈ చట్టం కింద ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు మీరు పెంచి పోషించిన గంజాయి బ్యాచ్‌లే కారణమని లోకేష్ మండిపడ్డారు. మా ప్రభుత్వం మీలాగా నిద్రపోవడం లేదని… మీరు నాటిన విషబీజాల్ని నిర్మూలించే పనిలో ఉన్నామని పేర్కొన్న లోకేష్… రాష్ట్రంలోని నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నామని.. గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తూ.. మీరు తయారుచేసిన సైకోల్ని కంట్రోల్ చేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్.
ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్‌ను వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్.. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్.. నేరస్థులు ఇష్టం వచ్చినట్లు బతికే లైసెన్స్ ఇచ్చావ్.. నీ తమ్ముడు అవినాశ్‌రెడ్డి హత్యచేసినా కాపాడావ్.. అనంతబాబులాంటి వాడు దళితులను చంపితే ఇంటికి పిలిచి భోజనం పెట్టావ్.. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్లకు టికెట్లు ఇచ్చావ్.. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా మంత్రి లోకేశ్ విరుచుకుపడ్డారు.
అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైనది రాష్ట్రంలో మరోటి ఉందా అని ప్రశ్నించారు. నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారని.. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని పలమనేరులో బాగా చదివే మిస్బా అనే పదో తరగతి విద్యార్థినిని వేధించడంతో ఆత్మహ*త్య చేసుకుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి నేరానికీ జగన్ పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణమన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా ఆయన పాలన సాగిందని విమర్శించారు. గత టీడీపీ హయాంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే.. జగన్ అధికారంలోకి రాగానే వాటిని మూలనపడేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.