కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో తల్లికి వందనం మొదటిది. ఈ పథకాన్ని ఎలాంటి గందరగోళం లేకుండా కూటమి సర్కార్ ప్రారంభించింది. దీంతో వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం 13 వేలే ఇస్తూ, 2 వేల రూపాయలు లోకేష్ తన ఖాతాలోకి మళ్లించుకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఐతే ఈ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ చాలా సీరియస్‌గా స్పందించారు. రూ. 2వేలు తన అకౌంట్ లో జమ అయినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు సవాల్ విసిరారు.
24 గంటల సమయం ఇస్తున్నా… నా ఖాతాలో 2వేలు పడినట్టు నిరూపించాలి లేదంటే , ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్. అలా చేయకుంటే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. గతంలోలాగా అసత్య ఆరోపణలపై ఇకపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో ఏడాదిలో చూపిస్తామన్నారు లోకేష్. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెంచాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల 600స్కూల్స్ లో వన్ క్లాస్ – వన్ టీచర్ మోడల్ తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు తప్పనిసరిగా అన్ని చోట్ల ఉచిత కరెంట్ అందిస్తామన్నారు లోకేష్. సోమవారం నాటికీ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఇక ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు లోకేష్. కొందరి అకౌంట్‌లు యాక్టివ్ కాలేదని, అందుకే డబ్బులు రిటర్న్ అవుతున్నాయన్నారు. తిరిగి ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలన్న లోకేష్…అకౌంట్ లు యాక్టివ్ కాగానే తల్లికి వందనం నగదు జమ అవుతుందని చెప్పారు. అయితే, అంగన్ వాడీ పిల్లలకు తల్లికి వందనం వర్తించదు అని క్లారిటీ ఇచ్చారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.