గడచిన ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో టీడీపీ కూటమి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పలు కొత్త అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇతరత్రా శాఖల మాటను అలా పక్కనపెడితే… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ఐటీ శాఖలో మాత్రం రోజుకో కొత్త తరహా పరిణామం చోటుచేసుకుంటోంది. గడచిన రెండు నెలలుగా లోకేశ్ ఎక్కడికి వెళ్లినా… స్కిల్ సెన్సస్ అనే పదాన్ని పదే పదే వినియోగిస్తున్నారు. ఇప్పటిదాకా ఆ పదాన్ని విన్న నాథుడే లేడని చెప్పాలి. ఏదో స్కిల్ డెవలప్ మెంట్ అంటే… నైపుణ్యాభివృద్ధి గురించి చర్చోపరచ్చలు సాగినా… ఏనాడూ స్కిల్ సెన్సస్ అన్న పదమే వినబడలేదు. అయితే లోకేశ్ చెబుతున్నట్లుగా ఈ స్కిల్ సెన్సస్ ను ఏపీ సర్కారు పక్కాగా అమలు చేస్తే… రాష్ట్ర రూపురేఖలే మారిపోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఢిల్లీ వెళ్లిన లోకేశ్… సోమవారం కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి సయంత్ చౌధురితో ప్రత్యేకంగా సమావేశమయ్యారుు. ఈ సందర్భంగా స్కిల్ సెన్సెస్ ను ఎలా చేపడతామన్న విషయాన్ని లోకేశ్ కేంద్ర మంత్రికి వివరించారు.
స్కిల్ సెన్సెస్ మీద లోకేశ్ ఇచ్చిన ప్రజెంటేషన్ కు కేంద్ర మంత్రి నోటమాట రాలేదట. దేశంలోనే తొలిసారిగా… కొంగొత్తగా నిర్వహిస్తున్న స్కిల్ సెన్సెస్ కు అవసరమైన అన్ని సహాయసహకారాలను ఏపీకి అందజేస్తామని జయంత్ అక్కడిక్కడే లోకేశ్ కు భరోసా ఇచ్చారట. వాస్తవానికి స్కిల్ సెన్సస్ అనే పదమే కొత్తదైతే..దాని నిర్వహణ గురించి ఏ ఒక్కరికి తెలియదనే చెప్పాలి. ఇకపై స్కిల్ సెన్సస్ కు సంబంధించి ఎవరికి ఏ సందేహం వచ్చినా… వారంతా ఏపీకి పరుగులు పెట్టాల్ిసందే. వారికి లోకేశే వారికి సందేహ నివృత్తి చేయాలి. మొ్తంగా స్కిల్ సెన్సస్ విషయంలో ఏపీ దేశానికి రోల్ మోడల్ గా నిలవనుండగా… దాని క్రియేటర్ గా లోకేశ్ కు ప్రత్యేక గుర్తింపు దక్కిందన్న కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయినా స్కిల్ సెన్సస్ లో ఏం చేస్తారు? అసలు దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?, .యువత తలరాతను ఇది ఏ రీతిన ప్రభావితం చేయనుంది?.. రాష్ట్ర పురోభివృద్ధికి ఇది ఎలా దోహదపడుతుంది?… ఇలా ఎన్నెన్నో సందేహాలు వినిపిస్తున్నాయి.
సెన్సస్ అంటే జన గణన. అంటే జనాభా లెక్కలు అన్న మాట. మరి స్కిల్ సెన్సస్ అంటే… జన గణనతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాల వివరాలు అన్న మాట. మొత్తంగా ఓ వ్యక్తిని తీసుకుంటే… అతడిలో ఏ తరహా నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యం అతడికి ఎలా అలవడింది? అతడి విద్యార్హత ఏమిటి?… ఇలా సదరు వ్యక్తిలోని స్కిల్స్ అన్నింటినీ నమోదు చేయడాన్నే స్కిల్ సెన్సెస్ అంటాం. వాస్తవానికి అటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా స్కిల్ డెవలప్ మెంట్ మీద పెద్దఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నాయి. వ్యక్తుల్లోని నైపుణ్యాలను అబివృద్ధి చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే స్కిల్ డెవలప్ మెంట్ లో ఆయా ప్రభుత్వాలు ఇచ్చే శిక్షణలు ఏదో అలా రొటీన్ గా జరిగిపోతున్నాయి. అయినా శిక్షణ ఇచ్చే వ్యక్తిలో అప్పటిదాకా ఏ తరహా నైపుణ్యం ఉంది అన్నది తెలుసుకుంటే… ప్రభుత్వాలు అతడిలోని స్కిల్ ను మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కదా. ఇప్పటిదాకా జరగని ఈ పనిని ఇప్పుడు లోకేశ్ నేతృత్వంలోని ఏపీ ఐటీ శాఖ చేపట్టనుంది.
స్కిల్ సెన్సెస్ పూర్తి అయితే ఏపీలోని యువతలో ఏ తరహా స్కిల్స్ అధికంగా ఉన్నాయన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. అంతేకాకుండా ఏపీలో అపారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే…అందుకు అవసరమైన స్కిల్స్ ఏపీ యువతలో ఉన్నాయా?..లేదా? అన్న విషయంపైనా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. అప్పుడు ఏపీలో ఉన్న అవకాశాలకు అనుగుణంగా యువతలో ఏ తరహా స్కిల్స్ అభివృద్ధి చేయాలన్న విషయంపైనా స్పష్టత వస్తుంది. అంతేకాకుండా ఆ తరహా స్కిల్స్ ఇప్పటికే రాష్ట్ర యువతలో ఆశించిన మేర ఉంటే.. ఇక యుద్ధ ప్రాతిపదినక పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అసలు రాష్ట్ర పురోభివృద్ధికి ఎలాంటి నైపుణ్యాలు కావాలో?… యువతలో ఏ తరహా స్కిల్స్ ఉన్నాయో తెలియకుండా ముందడుగు వేయడమంటే… చీకటిలో రాయి వేసినట్టే కదా. అందుకే లోకేశ్ ఇవన్నీ ఆలోచించిన తర్వాతే స్కిల్ సెన్సెస్ అంటూ ఓ సరికొత్త అంశానికి తెర తీశారు. ఇది ఏపీ రూపు రేఖలను మార్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.