చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు కొద్ది రోజులపాటు గ్యాప్ ఇచ్చిన టీడీపీ ఇక జోరుగా వాటిని తిరిగి మొదలుపెట్టనుంది. చంద్రబాబు అరెస్టు అయిన సెప్టెంబరు 9 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసి న్యాయం కోసం పోరాడాల్సి వచ్చింది. రాజోలు నియోజక వర్గంలో అప్పుడు పాదయాత్ర నిలిచిపోయింది. రెండు నెలల తర్వాత ఆ పాదయాత్రను ఈ నెల 24 నుంచి పున: ప్రారంభించనున్నారు. పాదయాత్ర నిలిచిపోయిన చోట నుంచే తిరిగి మొదలు పెట్టాలని నిర్ణయించారు. దీన్ని యువగళం 2.0 గా టీడీపీ నేతలు చెబుతున్నారు.
యువగళం పాదయాత్ర 2.0 అంటూ ప్రకటన వచ్చిందో లేదో అధికార వైఎస్ఆర్ సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. పాదయాత్రకు ఊహించని రీతిలో జనం తరలి వస్తున్నారు. మొదట్లో ఈ పాదయాత్రను వైఎస్ఆర్ సీపీ తేలిగ్గా తీసుకోగా, ప్రతి చోటా యువగళంలో కనిపిస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నేతలు బాగా కంగారు పడుతున్నారు. అంందుకు తగ్గట్లుగా యాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చేలా చేశారో లెక్కేలేదు.
పైగా ఇప్పుడు యువగళం యాత్రకు జనాల నుంచి మరింత ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టించి చంకలు గుద్దుకున్న వైఎస్ఆర్ సీపీ.. తెలియకుండా పెద్ద తప్పిదమే చేసింది. జైలులో ఉన్నప్పుడు చంద్రబాబుకు వచ్చిన మద్దతు చూసి కూడా అవాక్కైంది. ఆ తప్పిదంతోనే ప్రజల్లో వైఎస్ఆర్ సీపీకి ఆదరణ మరింత దిగజారిపోయింది. ప్రస్తుతం నడుస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆ ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. పైగా యువగళం 2.0 పాదయాత్రలో నారా లోకేశ్ ప్రస్తావించే ప్రధాన అంశం.. చంద్రబాబు అక్రమ అరెస్టు గురించే ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ కక్ష్యసాధింపు తీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. జనాదరణ కూడా గతంలో కంటే మరింతగా ఉంటుంది. ఈ పరిణామాలు ఊహించుకొనే ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం. యువగళం సాగే ప్రాంతాల్లోని నేతలకు దానికి అడ్డంకులు సృష్టించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయని కూడా సమాచారం.
ఈ యువగళం పాదయాత్రను విశాఖపట్నంలో ముగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే లోకేష్ పాదయాత్ర ఇచ్చాపురం వరకు సాగాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాదయాత్రను కుదించే యోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు గతంలో ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను చేసినప్పుడు కూడా విశాఖలో ముగించారు. లోకేష్ కూడా విశాఖలోనే పాదయాత్ర ముగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.