ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన చేసిన తర్వాత నుండి అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. మరోవైపు విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి ఆది నుండి బాలారిష్టాలు తప్పడం లేదు. రోజుకొక కొత్త సమస్య విశాఖ వేదికగా తలెత్తడం జగన్ కుపెద్ద తలనొప్పిగా తయారైంది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చి, కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించి, అమరావతిని శాసన రాజధానిగా ఉంచటానికి నిర్ణయించిన జగన్ రాజధాని తరలింపు వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఊహించని ఇబ్బందులు కూడా పరిపాలనా రాజధాని విశాఖకు ఎదురవుతున్నాయి. మొత్తంగా విశాఖకు పరిపాలనా రాజధాని విషయంలో జగన్ ఓ అడుగు ముందుకేస్తే.. రెండు అడుగులు వెనక్కు వేసేలా పరిస్థితులు ఎదురు తంతున్నాయి.
జగన్ కమిటీలు ఏం చెప్పాయంటే..?
గతంలో రాజధానిగా విశాఖ కుండా అనుకూలతలు, ప్రతికూలతల మీద జీఎన్ రావ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం విశాఖ సాగర తీరం కాబట్టి, తుఫానుల బెడద ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని.. సముద్రానికి వీలైనంత దూరంలో రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. విశాఖలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, నీటి కాలుష్య సమస్యల్ని ప్రస్తావించటంతో పాటు విశాఖలో తగినంత భూమి అందుబాటులో లేకపోవటాన్ని కూడా ఆ కమిటీ ప్రస్తావించింది. ఇక విశాఖకు తుపాన్ల ముప్పుతో పాటు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిమితులు ఉన్నాయని పేర్కొంది. తీరం కోతకు గురి కావటం లాంటి సమస్యల్ని కూడా ప్రస్తావించింది. అంతేకాదు విశాఖలో సముద్రం కారణంగా భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారటం కూడా ఒక ఇబ్బంది అని పేర్కొంది. విశాఖ లో ఉన్న పారిశ్రామిక వాడలు, పోర్టు సంబధిత కార్యకలాపాల కారణంగా పారిశ్రామిక కాలుష్య సమస్యలు బాగా ఉన్న చోట రాజధాని ఏర్పాటు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. జోన్ 1లో వచ్చే విశాఖలో భారీ పరిశ్రమలు, పోర్టులు ఉన్నందున గాలి నాణ్యత క్షీణిస్తుందని కూడా నివేదిక పేర్కొంది. తూర్పు నౌకాదళ కేంద్రం ఉన్న నేపథ్యంలో అణు జలాంతర్గాములకు ఇది కేంద్రం కావటంతో భద్రతా పరమైన సమస్యలున్నట్లుగా ఆ కమిటీ హెచ్చరించింది. ఇక్కడున్న వివిధ పరిమితుల కారణంగా కొత్తగా పరిపాలనా కార్యకలాపాలను ప్రారంభించటం అంత మంచిది కాదని జీఎన్ రావు కమిటీ నివేదిక వెల్లడించింది. జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ నివేదికలన్నీ విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయడానికి ఉన్న అనుకూలతలను చెప్పడంతో పాటుగా ప్రతికూలతలను కూడా వెల్లడించాయి.
మునిగే విశాఖలో రాజధాని ఎలా?
ఇదిలా ఉంటే తాజాగా వచ్చే 80 ఏళ్ల భారత్లో 12 నగరాలు నీట మునగడం ఖాయమని.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని, విశాఖ కనుమరుగవుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసిన నివేదిక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా, మంచు కరిగి, సముద్ర మట్టం పెరగడం వల్ల విశాఖ నగరం మునిగిపోతుందన్న వార్త పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రశ్నగా మిగిల్చింది. 2100 నాటికి విశాఖనగరం మూడు అడుగుల నీటిలో మునిగి పోతుంది అని నాసా నివేదికలో స్పష్టం చేయడంతో, రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు కాకముందే రాజధానిగా విశాఖ పై నీలినీడలు మరోమారు కమ్ముకున్నాయి. విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని మొదటి నుండి మొండిగా ముందుకు వెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తాజా నాసా ప్రకటన మరో కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. రానున్న 80 ఏళ్ల లోనే మునిగిపోతుందని చెబుతున్న విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయడానికి కావలసిన అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉండటంపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది. తాజా నాసా ప్రకటన కూడా అందుకు కారణంగా మారింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తారా? అన్న దిశగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆది నుంచి అన్నీ అపశకునాలే ఎదురవుతున్న నేపథ్యంలో విశాఖ కొత్త రాజధానిగా మారడం, అమరావతి శాసన రాజధానిగా పరిమితం కావడం అన్నది జరగబోదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- టీడీపీ దెబ్బకు వైసీపీకి బొమ్మ కనిపిస్తోందే