అనేకానేక మలుపులు తిరిగిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు సమసిపోయి తిరిగి పగ్గాలు సోనియా గాంధీ చేతుల్లోకే రావడంతో “ఇదే అదను కాంగ్రెస్ కదను నడిపించెదన్“ అన్నట్లుగా హైస్పీడులో పరిగెడుతున్నారు. ఏఐసీసీ సమావేశంలో తనకు తిరిగి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత స్థితప్రజ్ఞతతో వ్యవహరించారు.
నూరేళ్లకు పైబడిన కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న వివాదాలు ఉంటాయని, అలా ఉండకపోతే అంతర్గత ప్రజాస్వామ్యం లేనట్లేనంటూ ఓ బరువైన ప్రసంగం చేశారు. అంతే కాదు… సీనియర్లందరూ ఎప్పటిలా కలిసి పని చేయాలని కూడా పిలుపునిచ్చారు. దీంతో కాసింత సీరియస్ గా ఉన్న సీనియర్లు వెనక్కి తగ్గారు. ఆ రోజు ప్రారంభించిన దూకుడు రోజు రోజుకూ పెంచుతున్నారు సోనియా గాంధీ.
బుధవారం నాడు జరిగిన బీజేపీయేతర రాఫ్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల వీడియో సమావేశంలో అందరినీ సమన్వయపరిచే పనిని సోనియాగాంధీయే తీసుకున్నారు. అంతే కాదు తనతో వైరం ఉందని లోకం అంతా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన “పరీక్షలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం’’ అన్న ప్రతిపాదనకు ముందుగా మద్దతు పలికింది కూడా సోనియా గాంధీయే. ఈ పరిణామానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు ఇతర పార్టీల ముఖ్యమంత్రులు కూడా ఒకింత ఆశ్యర్చచకితులయ్యారు. ఈ సమావేశాన్ని అంతా తానై నడిపిన సోనియా గాంధీ భవిష్యత్ లో మనం కలిసి నడవాలన్న సంకేతాలను ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా గురువారం నాడు సోనియా గాంధీ వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులతో టెలీఫోన్ సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాలలో పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పార్టీ పదవులపై కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో బలపడాలని, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బలాన్ని నిలుపుకోవాలని దిశానిర్దేశించారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లలో కలిసి వచ్చే పార్టీలతో ఐక్య ఉద్యమాలు చేయాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వారి వైఫల్యాలపై నిరసనలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. పార్టీలో కష్టపడే వారికే తప్ప అన్యులకు పదవులు ఉండవని, అంతర్గత రాజకీయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఏఐసీసీ దూతలను ప్రతీ రాష్ట్రానికి పంపించి పార్టీని బలపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
“నేను తాత్కాలిక అధ్యక్షురాలినే. అయితే కొత్త అధ్యక్షులు వచ్చే వరకూ పార్టీని పటిచే బాధ్యత నాపై ఉంది’’ అని స్పష్టం చేశారు. తన ఆరు నెలల పదవికాలంలో అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కి జవసత్వాలు తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనయుడు రాహుల్ గాంధీకి పటిష్టమైన పార్టీ అప్పగించి వచ్చే ఎన్నికలలో ఆయనను ప్రధానిగా చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలో బీజేపీనీ, రాష్టాలలో ప్రాంతీయ పార్లీల బలాలను తట్టుకుని సోనియా గాంధీ ఎంత వరకూ నెగ్గుకురాగలరన్నదే ప్రశ్న.