నాయిక ప్రధానమైన సినిమాలు చేయడంలో నయనతార ముందు ఉంటుంది. కథ ఏదైనా దాని భారాన్ని చివరివరకూ మోయగల సామర్థ్యం నయనతార సొంతం. నాయిక ప్రధానమైన ఆమె చిత్రాలు కొన్ని స్టార్ హీరోల హిట్ సినిమాలతో సమానమైన వసూళ్లను రాబట్టాయి. అలాంటి నయనతార మలయాళంలో చేసిన ‘నిళల్’ చిత్రం, తెలుగు వెర్షన్ గా ‘నీడ’ టైటిల్ తో ‘ఆహా’లో రిలీజ్ అయింది. భట్టాత్రి దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా, మిస్టరీ థ్రిల్లర్ గా సాగుతుంది. నయనతారకి గల క్రేజ్ ను బట్టి, ఈ సినిమాపై అందరిలో ఆసక్తికి రేకెత్తడం సహజం.
శర్మిల .. ఆమె ఎనిమిదేళ్ల కొడుకు .. మేజిస్ట్రేట్ జాన్ బేబీ చుట్టూ ఈ కథ తిరుగుంది. ఈ ఎనిమిదేళ్ల కుర్రాడు తన స్కూల్లో ఒక క్రైమ్ కథ చెబుతాడు. అది ఒక సాధారణమైన కథ కాకుండా నిజంగా జరిగిన సంఘటనగా అనిపించడంతో, అసలు కథ మొదలవుతుంది. ఆ కేసుకు సంబంధించిన పరిశోధన ప్రారంభించిన జాన్ బేబీకి తెలిసిన అసలు నిజం ఏమిటి? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామమాలు ఎలాంటివి? అనేది కథ. ఇది మిస్టరీ థ్రిల్లర్ అనే సరికి ప్రేక్షకులు ఏం జరుగుతుందోనని కాచుకుని కూర్చుంటారు .. కానీ ఓ పావుగంటలో సినిమా అయిపోతుంది అనేవరకూ తెరపై ఏమీ జరగదు.
ఈ తరహా సినిమాల్లో కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉండాలి? ఆశ్చర్యచకితులను చేస్తూ సాగాలి. కానీ చివరి 15 నిమిషాల్లోనే ఉంది అసలు రహస్యం అన్నట్టుగా గుప్పెట్లో దాచేసి, అప్పటివరకూ ఓపిక చేసుకుని నడవాల్సిందే అన్నట్టుగా కథ నడుస్తుంది. పాత్రలను .. వాటి వృత్తులను కూడా ఎక్కడికో తీసుకెళ్లి అక్కడ నడిపించారు. చివరి పావుగంటలో రివీల్ చేసిన సస్పెన్స్ ను ఇంటర్వెల్ తరువాత చేసేసి, అక్కడి నుంచి ఆ కథ నడిపిస్తే బాగుండేదేమో అనిపించకమానదు. దీపక్ డి మీనన్ ఫొటోగ్రఫీ .. సూరజ్ కురుప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆదుకోకపోతే, ఈ సినిమా మరింతగా నీరుగారిపోయేదేమో.
Must Read ;- నయనతారతో విఘ్నేష్ ది కేవలం డేటింగేనా?











