ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న పాలనపై ప్రజల్లో అంతకంతకూ అసంతృప్తి పెరిగిపోతోంది. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలంటూ జగన్ ఊదరగొడుతున్నా.. జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయంటే.. జగన్ సర్కారు పాలన ఏ రీతిన సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విపక్ష టీడీపీ కూడా పానలో అనుభవం లేదన్న కారణంగా జగన్ కు ఓ మోస్తరు సమయాన్నే ఇచ్చిందని చెప్పాలి. అయితే జగన్ తనదైన శైలి దూకుడుతో ఏమాత్రం ప్రజోపయోగం లేని నిర్ణయాలతో ప్రజల నడ్డి విరుస్తున్న వైనంతో టీడీపీ చాలా కాలం క్రితమే పోరు బాట పట్టింది. జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపైనా తమదైన శైలి అధ్యయనంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఆయా నిర్ణయాలతో ప్రజలు ఏ మేర ఇబ్బందులు పడుతున్నారన్న విషయాలను క్రోడీకరించుకుని రంగంలోకి దిగిపోతోంది. ఈ కారణంగానే టీడీపీ చేస్తున్న నిరసనలు, ధర్నాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అంతేకాకుండా టీడీపీ నిరసనల్లోని వాస్తవికతను చూసి వైసీపీ ప్రభుత్వం కూడా తన నిర్ణయాలను మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనే చెప్పాలి. మొత్తంగా ప్రజల తరఫున బాధ్యత కలిగిన విపక్షంగా టీడీపీ నిర్ణయాత్మక పాత్రను పోషించడంలో సఫలమైందనే చెప్పాలి.
జగన్ పై ఒత్తిడి పెరిగేదిలాగే
ఇలాంటి క్రమంలో సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీలోని సీనియర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రజా వ్యతిరేక పాలనపై సాగిస్తున్న పోరును మరింత ఉధృతం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసలు జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజలు ఏ రీతిన ఇబ్బందులు పడుతున్నారన్న వైనాన్ని బాగా ఫోకస్ చేయాలని, పార్టీ చేపట్టే నిరసనలు.. ఏదో టీడీపీ నిరసనల్లా కాకుండా వాటిలో సాధారణ ప్రజలు పాలుపంచుకునేలా ప్లాన్ చేయాలని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా జగన్ సర్కారు తీసుకుంటున్న ఏ నిర్ణయంపై అయినా గుడ్డిగా విమర్శలు చేయరాదని, ఆయా నిర్ణయాల వల్ల ప్రజలకు ఏ రీతిన నష్టం జరుగుతుందన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేయాలని సూచించారు. ఈ తరహా నిరసనల వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పాటుగా.. టీడీపీకి ప్రజల్లో మంచి మైలేజీ దక్కుతుందని కూడా చంద్రబాబు చెప్పారు. ఇప్పటిదాకా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఇదే రీతిన జరిగాయని, ఇకపైనా సాంతంగా పీపుల్ సెంట్రిక్ గానే వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
యూత్, స్టూడెంట్ వింగే కీలకం
పార్టీ తరఫున ఏ కార్యక్రమాన్ని చేపట్టినా.. పార్టీకి సంబంధించిన యువజన, విద్యార్థి విభాగాలు ముందు వరుసలో నిలవాలని చంద్రబాబు సూచించారు. ఇటీవల జగన్ సర్కారు విడుదల చేసిన జాబ్ కేలండర్ పై టీడీపీ చేపట్టిన నిరసనలు ఏ మేర విజయవంతం అయ్యాయన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. అంతేకాకుండా ఇటీవలే నిర్వహించిన సీఎం ఇల్లు ముట్టడిఏ మేర విజయవంతమైందన్న విషయాన్ని వివరిస్తూనే.. అందులో పార్టీ యువత, విద్యార్థి విభాగాలు ఏ మేర కీలకంగా వ్యవహరించాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లోకి దూకుడుగా చొచ్చుకువెళ్లే అవకాశం యూత్ వింగ్ కే ఉంటుందని, పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్లు, మేథావులు.. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల వెనుక ఉండి వారిలో మనోధైర్యం పెరిగేలా వ్యవహరించాలని సూచించారు. పార్టీ కీలక నేతలంతా ఇక రెస్ట్ తీసుకోవడం కుదరదని, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకోవాల్సిందేనని కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా జగన్ సర్కారుపైకి పోరును మరింత ఉధృతం చేయాల్సిన అవసరాన్ని చెబుతూనే.. యువజన, విద్యార్థి విభాగాల ప్రాధాన్యతను చంద్రబాబు తనదైన మార్కు ఈక్వేషన్లతో వివరించారు. మొత్తంగా చంద్రబాబు దిశానిర్దేశంతో జగన్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ తనదైన మార్కు నిరసనలను మరింతగా హోరెత్తించనుందనే చెప్పాలి.
Must Read ;- జగన్ గారు.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దు!