వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా మెలిగిన, కడప జిల్లాకు చెందిన ఓ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. జగన్ వ్యవహరిస్తున్న తీరుపట్ల ఈయన చాలా అసహనంతో ఉన్నారు. కడపకు చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఇటీవలే నెల రోజుల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీ అప్రజాస్వామిక విధానాలు నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు లేఖలో ఆయన అప్పుడు పేర్కొన్నారు. పార్టీలో కొన్ని నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో జగన్ తెలుసుకోవాలని సూచించారు. సలహాదారులు జగన్ కు ప్రజాభిప్రాయాలను కరెక్ట్ గా చెబితే బాగుంటుందని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వ్యాఖ్యలు చేశారు.
అయితే, తాజాగా రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున పార్టీలు మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల వైసీపీ కఠినంగా వ్యవహరిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించగా.. దీనిపై ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యమంత్రి ఒక్కడిదే కాదు కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను పార్టీ నిర్ణయాలను ఉల్లంఘించలేదని అన్నారు. ఇలాంటి స్పీకర్‌ను తాను ఇప్పటి వరకూ తన జీవితంలో చూడలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలపై సర్వేలు చేయించడం కాదని.. ముందు ముఖ్యమంత్రిపై చేయించుకోవాలని సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. పులివెందులలోనే ఆయనకు వ్యతిరేకత ఉన్న విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని హితవు పలికారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్సీ ఉన్న రామచంద్రయ్య వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించి భంగ పడ్డారు. జగన్ ఎన్నో హామీలిచ్చి అన్యాయం చేశారు. దీంతో వైసీపీని వీడడంతో పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఫలితంగా సి.రామచంద్రయ్యకు నోటీసులు జారీ చేశారు. పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం విచారణ జరగడంతో సి.రామచంద్రయ్య దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని అన్నారు. ఏం చేసినా జగన్ చేసిన అప్పులు తీరవని.. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్‌కు చెప్పినా ఆయన వినిపించుకునే పరిస్థితి లేదని అన్నారు. తనలాగే వైపీసీలో ఇంకా ఎంతో మంది అసమ్మతి నేతలు ఉన్నారని అన్నారు. సమయానుకూలంగా వారు కూడా బయటకు వస్తారని చెప్పారు. పులివెందులో కూడా జగన్ కు దెబ్బ తగలడం ఖాయమని సి రామచంద్రయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీ పాలన ఉందనే తాను వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని అన్నారు. దానిని నిబంధనలకు అనుగుణంగా ఆమోదించాలేకానీ.. మనసులో ఏదో పెట్టుకుని ఇప్పుడు నోటీసు ఇవ్వడం కరెక్టు కాదని అన్నారు. దీనిపై తాను హైకోర్టులోనే తేల్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. స్పీకర్ రాజకీయ పార్టీల సభలకు హాజరుకావడం, అక్కడే రాజకీయాల గురించి మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఆయనపై కూడా కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని అన్నారు. మళ్లీ జగన్ సీఎం అయితే రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన తప్పదని అన్నారు.