పెద్దారెడ్లు ఓ వైపు.., జూ. ఎమ్మెల్యేలు, మంత్రులూ మరోవైపుగా నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ పార్టీలో ఏడాది నుంచి ఆధిపత్యపోరు సాగుతోంది. ఆనం vs అనిల్.., మేకపాటి vs అనిల్.., కాకాని vs కోటంరెడ్డి.. ఇలా ఎన్నోసార్లు నేతలు తమ ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించి పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టారు. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే నేతలు ప్రెస్ మీట్స్ పెట్టి పార్టీ లైన్ దాటి మాట్లాడారు. జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని తనవంతు ప్రయత్నాలు చేసినా విభేదాలు మాత్రం చల్లారలేదు. త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో పార్టీ అధిష్టానం నెల్లూరు జిల్లా నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి సిద్ధమైంది. మంగళవారం జగన్‌కి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేనితో కలిసి ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ ద్వారా తమకు అందిన సమాచారాన్ని, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో చర్చించారు. పార్టీ లైన్ దాటితే చర్యలుంటాయని, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి ఉప ఎన్నిక సమయానికి సయోధ్య సాధ్యమేనా..?
తిరుపతి ఎంపీగా 2019 ఎన్నికల్లో బల్లి దుర్గా ప్రసాద్ విజయం సాధించారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించడం తో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కానీ, తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు ఆనం రాం నారాయణ రెడ్డి, మరికొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో పరిస్థితి చక్కదిద్దడంపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీలో నేతల మధ్య ఉన్న అధిపత్య పోరు ఉప ఎన్నికపై ప్రభావం చూపించకుండా ఉండాలని సజ్జల నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకుండా, వారి సన్నిహితులు సూడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తుండటంతో కూడా పార్టీలో గ్రూపులు ఏర్పడి వివాదాలు రేగుతున్నాయి. దీనికి ఉదాహరణగా సమావేశ మందిరం వద్దే సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, ద్వితియశ్రేణి నేత సత్యనారాణయణ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇదే విధంగా నెల్లూరు, నెల్లూరు రూరల్, కావలి నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల బంధువులు ఆధిపత్యపోరు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అధికారులు ఎమ్యెల్యేల కంటే సూడో ఎమ్మెల్యేల ఆదేశాలు పాటించలేక ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ఈ మీటింగ్‌లతో నేతల మధ్య విబేధాలు సద్దుమణగడం అనేది ఎండమావిలో నీళ్లు వెతుక్కోవడమే అని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి.. సజ్జల ఆదేశాలు నేతలు ఎంత వరకు వింటారో..?