దుబాయ్ వేదికగా మంగళవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ కేవలం 147 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో చెన్నై జట్టు క్వాలిఫైయర్స్ అవకాశాలను పెంచింది. కానీ ధోని చేసిన ఓ పనిని మాత్రం క్రీడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రీడా స్ఫూర్తిని మరిచిపోవడమే కాకుండా ఐపీఎల్ నిబంధనలను ఉల్లఘించి అంపైర్ ను ధోని బెదిరించాడు. ఫెయిర్ ప్లేకి విరుద్ధంగా ధోని చేసిన ఈ పనిపై క్రికెట్ అభిమానులే గాక నెటిజన్స్ మండిపడుతున్నారు.
విలియమ్సన్ ఒంటరి పోరుతో హైదరాబాద్ లక్ష్యం దిశగా సాగింది. విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేసి ఔట్ కాగానే హైదరాబాద్ పోరాటం ముగిసిందని అందరూ భావించారు. కానీ రషీద్ ఖాన్ దూకుడుగా ఆడటంతో 11 బంతుల్లో 24 రన్స్ చేయాల్సిన హైదరాబాద్ పరిస్థితికి వచ్చింది. ఈ సమయంలో బౌలింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ లెగ్ స్టంప్ అవతల బాల్ వేయడంతో వైడ్ గా అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ 11 బాల్స్ లో 23 పరుగులు చేయవలసి వచ్చింది. తన నెక్స్ట్ బాల్ కూడా శార్దూల్ ఠాకూర్ లెగ్ స్టంప్ అవతల వేశాడు. దీనిని కూడా అంపైర్ పాల్ రైఫిల్ వైడ్ ఇద్దామని చేయి చాపపోగా ధోని వికెట్ల వెనుక నుంచి సైగ చేశాడు. ఇది వైడ్ కాదని లెగ్ స్టంప్ పక్కనుంచి వచ్చిదంటూ చూపాడు. దీంతో అంపైర్ రైఫిల్ సర్దుకున్నారు. వైడ్ అయినా అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో డగౌట్ లో ఉన్న వార్నర్ ఫైర్ అవ్వడం విజువల్స్ లో కనబడింది.
ధోని ఇలా చేయడంపై క్రీడా వర్గాలలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మెజారిటీ మంది ధోని చేసింది తప్పని అతనిపై నిషేధం విధించాలంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ధోని చేసింది తప్పు కాదని చెప్పారు. మ్యాచ్ గెలిచేందుకు ధోని అంపైర్‌ను తన సైగలతో బెదిరించడం తప్పని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం ధోనికి ఇదే మొదటిసారి కాదని వారు కామెంట్ చేశారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా డగౌట్ లో ఉన్న ధోని ఫీల్డ్ లోకి దిగి బెదిరించిన సంగతి తెలిసిందే. అప్పుడు రెఫరీ ధోనిని హెచ్చరించి వదిలివేశాడు. ఇప్పుడు కూడా తన సైగలతో అంపైర్ రైఫిల్ ను బెదిరించిన ధోనిపై జరిమానా విధించాలంటూ హైదరాబాద్ అభిమానులు కోరుకుంటున్నారు. ధోని లాంటి సీనియర్ ఆటగాడు నుంచి ఇలాంటి క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన మనం ఊహించలేమని అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.











