యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇక కనుమరుగు అయినట్టేనని అన్ని దేశాలు ఒకింత ఊపిరి పీల్చుకుంటున్నాయి. భారత్ లో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మనకూ కరోనా ముప్పు తప్పినట్టేనన్న వాదనలు వినిపించాయి. అయితే తెలంగాణలో గురువారం వెలుగు చూసిన రెండు కొత్త కేసులను పరిశీలిస్తే మాత్రం మనం మరింత మేర జాగ్రత్తలు తీసుకోక తప్పదన్న హెచ్చరికలు జారీ అయిపోయాయి. కొత్తగా వెలుగు చూసిన ఈ 2 రెండు కేసుల్లో 48 ఏళ్ల పురుషుడితో పాటుగా 22 ఏళ్ల యువతికి డెల్టా ఏవై 4.2 రకానికి చెందిన కరోనా వైరస్ సోకిందని తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు బయటపెట్టకున్నా.. ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తుందన్న నిపుణుల సూచనతో మరింత కాలం పాటు మనం జాగ్రత్తలు పాటించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసలు డెల్టాలో ఎన్ని వేరియంట్లు?
కరోనా వైరస్ వ్యాప్తిలో డెల్టా వేరియంట్ జనాలను బెంబేలెత్తించింది. తొలి వేవ్‌లో ఈ వేరియంట్ కనిపించకున్నా.. సెకండ్ వేవ్‌లో కరోనా తన రూపాన్ని మార్చుకుంటోందని, త్వరలోనే డెల్టా రూపంలో విరుచుకుపడనుందన్న వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే డెల్టా వేరియంట్ తన ప్రభావం చూపకముందే.. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, మూడో వేవ్ సంకేతాలు అసలే లేకపోవడంతో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గినట్టేనన్న భావన వ్యక్తమైంది. ఈ భావన నిజమేనన్నట్లుగా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోయిన వైనం కూడా కనిపించింది. అయినప్పటికీ ఇప్పటికా ఆయా రాష్ట్రాల్లో కొత్తగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య మాత్రం జీరోకు చేరలేదు. ఈ తరహా పరిణామాలపై పరిశోధనలు సాగిస్తున్న నిపుణులు.. డెల్టా వేరియంట్లో ఏకంగా 60కి పైగా రకాలు ఉన్నాయని, వాటిలో ఏ వేరియంట్ రూపంలో కరోనా విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తాజాగా తేల్చి పారేశారు.
ఏవై 4.2 తీవ్రత ఎంత?
తెలంగాణలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య వందల్లోకి తగ్గిపోయింది. త్వరలోనే కొత్త కేసులు అసలే నమోదు కాకుండా ఉండే పరిస్థితి కూడా వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇలాంటి క్రమంలో గురువారం నాడు ఓ బాంబు లాంటి వార్త వినిపించింది. తెలంగాణకు చెందిన 48 ఏళ్ల పురుషుడు, 22 ఏళ్ల యువతికి కరోనా సోకగా.. వారిలో కనిపించిన కరోనా కొత్త వేరియంట్ ను వైద్యులు డెల్టా ఏవై 4.2గా గుర్తించారు. డెల్టా వేరియంట్లోని 60 రకాల్లో ఇది ఒకటని, ఇది డెల్టా సాధారణ వేరియంట్ కంటే 15 శాతం వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని కూడా నిపుణులు వెల్లడించారు. తెలంగాణలో తాజాగా వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే ఏపీతో పాటు కర్ణాటకలోనూ వెలుగు చూసిందని కూడా వెల్లడించారు. మొత్తంగా ఈ కొత్త వేరియంట్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో మరింత కాలం పాటు ప్రజలు కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.