తిరుమల వేంకటేశ్వరుని దర్శనాన్ని పైరవీకారులకు మాత్రమే పరిమితం అన్నట్లుగా మార్చేయడంలో ఇప్పుడున్న ధర్మకర్తల మండలి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తున్నాయి. డబ్బు దండిగా సమర్పించుకోలేని, దేవదేవుణ్ని చూడడానికి పైరవీకారుల్ని ఆశ్రయించలేని సామాన్య భక్తులకు అసలు తిరుమల వెళ్లాలంటేనే భయం పుట్టే పరిస్థితిని కల్పిస్తున్నారు. ప్రస్తుతం సమాజం ఉన్న కోవిడ్ భయానక పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. జాగ్రత్తలు తీసుకోవడం అనేది అందరికీ ఒకే రీతిగా ఉండాలి. పేదలు, ధనికులు లాంటి తారతమ్యాలు ఉండకూదు. దేవుడి ఎదుట అందరూ సమానమే అనే భావన కల్పించాలి. కానీ ఆ విషయంలో మాత్రం టీటీడీ విఫలం అవుతోంది. ప్రత్యేక ఆహ్వానితుల పేరితో 50 మందికిపైగా పదవులు కోరుకుంటున్న వారికి వెంకన్న కొలువులో స్థానం కల్పించడం అనేది ఎంత పెద్ద వివాదస్పదం అయిందో.. అంత పెద్దగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే తాజాగా సామాన్య భక్తుల దర్శనాలకు సర్వదర్శనానికి అనుమతిస్తూనే.. పెడుతున్న కొన్ని నిబంధనలు విస్తు గొలుపుతున్నాయి. దర్శనానికి రావాలంటే.. సామాన్యభక్తులు భయపడిపోయేలా, మనకెందుకులే అనుకునేలా చేస్తున్నాయి. అలా కాకపోతే.. ఈ నిబంధనల్నీ పాటించే బదులు దళార్లను ఆశ్రయిస్తే మేలనే భావన కలిగిస్తున్నారు.
సామాన్య భక్తులకే ఈ నిబంధనలు
త్వరలోనే తిరుమలేశుని సర్వదర్శనం మొదలు కానుంది. సర్వదర్శనం అంటేనే.. పెద్దమొత్తంలో డబ్బు పెట్టి టికెట్లు కొనలేని, పైరవీకారుల్ని ఆశ్రయించలేని పేద భక్తులు అని అర్థం. కోవిడ్ తరువాత సర్వదర్శనాన్ని మొదటిసారిగా అనుమతిస్తూ.. కొన్ని నిబంధనల్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసులు వేక్సినేషన్ వేసుకున్న సర్టిఫికెట్లను విధిగా కలిగి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఒకవేళ అలా వేక్సినేషన్ సర్టిఫికెట్ లేకుంటే గనుక.. దర్శనానికి రెండు రోజుల ముందు, కోవిడ్ నెగటివ్ టెస్ట్ సర్టిఫికెట్ ను తెచ్చుకోవాలని కూడా ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇలాంటి నిబంధనలు పెట్టడాన్ని తప్పుబట్టలేం. సామాన్యులకు ఈ నిబంధనలు ఇబ్బందే గానీ.. కొవిడ్ మహమ్మారి దృష్ట్యా అర్థం చేసుకోవాల్సిందే. అయితే ఇలాంటి నిబంధనలు కేవలం పేదలకు మాత్రమే పెట్టాలనుకోవడమే ఘోరంగా ఉంది. సర్వదర్శనానికి వచ్చే పేదలు కొవిడ్ వేక్సినేషన్ సర్టిఫికెట్ తేవాలంటున్న వారు.. సిఫారసు ఉత్తరాల మీద దర్శనాలకు వచ్చే వారికి ఇలాంటి నిబంధన విధించడం లేదు. ఇప్పటిదాకా సుపథం ద్వారాను, ప్రత్యేక సేవలకు అంతా సిఫారసు ఉత్తరాల ద్వారానే భక్తులను అనుమతిస్తున్నారు. వారెవ్వరికీ వేక్సినేషన్ నిబంధన లేదు. వైసీపీ నాయకులనుంచి సిఫారసు ఉత్తరాలు పొందగలిగే స్థాయి వారికి.. కొవిడ్ రాదని టీటీడీ అధికార్లకు బాగా నమ్మకంగా ఉన్నట్టుంది. అందుకే వారికి ఎలాంటి నిబంధన విధించడం లేదు.
వీరికేమీ కండీషన్లు లేవుగా
నిజానికి సిఫారసు ఉత్తరాలు అనేవి.. తిరుమలేశుని దర్శనాన్ని దళారీల భోజ్యంగా మార్చేశాయి. కేవలం బోర్డు సభ్యులు, మంత్రులు, పొరుగు రాష్ట్రాల మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రతిరోజూ ఇచ్చే సిఫారసు ఉత్తరాలు మాత్రమే కాకుండా.. లోకల్ గా ఎమ్మెల్యేలు సుపథం ద్వారా అనుమతించడానికి ఇచ్చే సిఫారసు ఉత్తరాలు కూడా అనేకం ఉంటాయి. వారికి ఉన్న లిమిట్ ప్రకారం లెక్కించినట్లయితే గనుక.. రోజుకు కనీసం 3 నుంచి 5 వేలకు పైగా సిఫారసు ఉత్తరాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. సిఫారసు చేసే హోదా ఉన్న ఏ ఒక్కరు కూడా.. తమ ఉత్తరాల్ని ఖాళీగా ఉంచుకోవడం లేదు. ప్రతిరోజూ ఫుల్లుగా పంపేస్తుంటారు! తమాషా ఏంటంటే.. ఇన్నివేల మంది సిఫారసుల ద్వారా వెల్లువలా వస్తున్న వీరెవ్వరికీ కోవిడ్ సర్టిఫికెట్ నిబంధన లేదు. కానీ.. రోజుకు 8 వేలమందిని మాత్రమే అనుమతిస్తాం అని ప్రకటించిన సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులకు మాత్రం నిబంధనలు అన్నీ విధించారు. జాగ్రత్తలు సమర్థనీయమే కానీ.. అలాంటి జాగ్రత్తలు సిఫారసు ఉత్తరాలద్వారా వచ్చేవారికి కూడా విధించాలనే డిమాండ్ భక్తుల వైపు నుంచి వినిపిస్తోంది.
Must Read ;- ఈ మొట్టికాయ నొప్పి భరించలేనిదే