తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ తగిలిన షాక్ తనకు ఎదురు కావొద్దని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలితే.. వారికి ఎసరు పెడుతున్నారు. సర్వేల్లో ఏ ఎమ్మెల్యే అయితే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేను పక్కకు నెట్టేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే 11 నియోజకవర్గాలకు ఇంఛార్జులను కూడా మార్చారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు ఉండేలా ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా ఆ జాబితాలో తాము ఉంటామేమో అని ఆందోళన చెందుతున్నారు. తమ సీటుకు కనుక ఎసరు వస్తే.. అవసరమైతే జగన్ కు ఎదురు తిరగడానికి కూడా కొంత మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు.
అయితే, జగన్ ఎడాపెడా అభ్యర్ధులను మారుస్తుండడం అనేది.. రాష్ట్రంలో నెగిటివ్ సంకేతాలను పంపుతోంది. ఓటమి భయం కారణంగానే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. మొన్నటిదాకా వైనాట్ 175 అంటూ ఎగిరి.. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు కళ్లకు కనిపించే సరికి వ్యూహాల వెంట పడుతున్నారు. మొదటి నుంచి జగన్ సర్వేలనే నమ్ముకున్నారు. డెవలప్ మెంట్ అనే మాట మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే తనను బతికిస్తాయని.. గట్టెక్కిస్తాయని నమ్ముతూ వస్తున్నారు. ఎంత సేపు ఆ సర్వేలపైనే ఆధారపడి ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే, ఆ సర్వేల అంచనాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల్లో గెలవడానికి తాను చాణక్యుడి తరహా వ్యూహాలను అమలు చేస్తున్నానని జగన్ అనుకుంటున్నారు. కానీ, తనకు తెలియకుండా తానే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చేసుకున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పార్టీ నేతలంతా.. ఇటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తరచూ ఈ అంశంపైనే జగన్ ను ప్రశ్నిస్తున్నారు. నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 11 నియోజకవర్గాల్లోనే కాదు 151 చోట్ల ఇన్ చార్జ్ లను మార్చినా వైసీపీ ఈసారి గెలవలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని జోస్యం చెప్పారు. వైసీపీ అనే పడవకు చిల్లు పడిందని, అందులోని జనం బయటపడే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నేతలు దూకి పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చేశారని కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు వేసిన 10 ప్రశ్నలకు కూడా వైసీపీ అధినేత వద్ద సమాధానం లేదు. కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా తెస్తానన్న విషయంలో, 2020 నాటికి పోలవరం పూర్తి చేస్తాననడంలో, ఏటా జాబ్ క్యాలెండర్, తదితర విషయాల్లో నిలదీసినప్పటికీ వైసీపీ నేతల వద్దఎలాంటి సమాధానం లేదు. అతి ముఖ్యమైన హామీలను గాలికి వదిలేసి ఇప్పుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి తన బుర్రకు ఎంత పదును పెట్టినప్పటికీ ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఆయన గుర్తించడం లేదు.