ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో… అలా పెట్టుబడులు రాష్ట్రానికి పోటెత్తుతున్నాయి. కూటమి పాలన మొదలై ఇంకా 5 నెలలు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే రాష్ట్రానికి లక్ష కోట్ట రూపాయల మేర పెట్టుబడులు వచ్చేశాయి. తాజాగా మరో కూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడికి సంబంధించి మంగళవారం కీలక ఒప్పందం జరగనుంది. ఈ భారీ పెట్టుబడిని భారత పారిశ్రామిక దిగ్గజం రియలన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టనుంది. రాష్ట్రంలో 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకున్న రిలయన్స్ కంపెనీ… రాష్ట్రంలో అనువుగా ఉన్న పలు ప్రదేశాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ కంపెనీ ఏకంగా రూ.65 వేల కోట్లను వెచ్చించనుంది. రిలయన్స్ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని 2.5 లక్షల మేర ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటిలో కొంతమేర ప్రతక్ష్యంగా లభించే ఉపాధి అవకాశాలు ఉండగా… మరికొన్ని పరోక్షంగా లభించే ఉపాధి అవకాశాలుగా చెబుతున్నారు.
కూటమి సర్కారు పాలన మొదలయ్యాక… ఏపీకి తొడ్పాటు అందించేందుకు ముందుగా టాటా సన్స్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నవ్యాంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్టణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యాంపస్ ను ఆ కంపెనీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఏపీకి చెందిన 10 వేల మందికి ఉపాధి లభించనుంది. తాజాగా సోమవారం అమరావతిలో జరిగిన సమావేశానికి హాజరైన టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్… ఏపీలో సౌర, పవన విద్యదుత్పత్తి రంగాల్లో రూ.40 వేల కోట్లమేర పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 20 స్టార్ హోటళ్లతో పాటుగా ఓ భారీ కన్వెన్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనలు వచ్చిన మరునాడే.. రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ కీలక ఒప్పందం చేసుకోనుంది.
ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు ముందు ఓ సారి ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. రిలయన్స్ కంపెనీ అధిపతులను కలిసేందుకే లోకేశ్ ఈ పర్యటనకు వెళ్లినట్గుగా సమాచారం. అంతేకాకుండా… గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్యాచరణ రూపొందించిందన్న విషయం తెలుసుకున్న మీదటే లోకేశ్ ముంబై పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా రిలయన్స్ కంపెనీలో గ్రీన్ ఎనర్జీ వ్యవహారాలు పర్యవేక్షించే అనంత్ అంబానీతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ భేటీలోనే రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో 500 బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దిశగా జూనియర్ అంబానీ, లోకేశ్ ల మధ్య అవగాహన కుదిరింది. ఈ అవగాహన మేరకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో రిలయ్స్ ప్రతినిధి బృందం, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకాలు చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ధృవీకరించారు కూడా.
కూటమి సర్కారు పాలన మొదలయ్యాక… ఏపీకి వచ్చిన అతి భారీ పెట్టుబడి రిలయన్స్ కంపెనీదే కానుంది. అంతేకాదండోయ్… గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ కంపెనీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అవతల పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదేనట. ఈ పెట్టుబడి కింద రిలయన్స్ ఏర్పాటు చేసే బయో గ్యాస్ ప్లాంట్లన్నీ… రాష్ట్రంలో నిరుపయోగంగా ఉండే భూములలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. అంటే.. రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లతో నిరుపయోగ భూములు కూడా వినియోగంలోకి వచ్చేసినట్టేనన్న మాట. ఈ పెట్టుబడిలో రూ.130 కోట్ల మేర ఈ నిరుపయోగ భూముల మీదే ఆ కంపెనీ పెట్టనుంది. ఈ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్రానికి పన్నుల రూపేణా కేంద్రం నుంచి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు లభించనున్నట్లుగా సమాచారం.