ప్రకృతి వైద్యంతో వికృతమైన ఈ కరోనాకు కళ్లెం వేయవచ్చంటున్నారు ఓ వ్యక్తి. ఆయన మరెవరో కాదు సినిమా దర్శకుడు టి. ప్రభాకర్. రెండిళ్ల పూజారి, బతుకమ్మ, జైభజరంగ భళీ, తుపాకీరాముడు తదితర చిత్రాల దర్శకుడైన ప్రభాకర్ కు ప్రకృతి వైద్యంలో ప్రవేశం ఉంది. ఆయన చెప్పే వైద్య విధానం కూడా క్లిష్టమైనదేమీ కాదు.. అందరూ చేసేదే. అదే లంకణం. లంకణం పరమౌషధం అనే మాట అందరూ విన్నదే కదా. ఉపవాసం ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. కరోనా మహ్మమ్మారిని లంకణం మాత్రమే తరిమి కొడుతుందని టి. ప్రభాకర్ అంటున్నారు. ఈ నేచర్ క్యూర్ విధానాన్ని జాతిపిత మహాత్మా గాంధీ ఆచరించి చూపారు.
ఆ వారసత్వాన్ని ఇప్పుడు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు , మరికొందరు నేచర్ క్యూర్ వైద్యులు కొనసాగిస్తున్న విషయాన్ని ప్రభాకర్ గుర్తుచేశారు. తాను కొన్నేళ్లుగా ఈ విధానాన్ని ఫాలో అవుతూ కొన్ని ప్రయోగాల్ని చేసి విజయవంతమయ్యానని ఆయన వివరించారు. తాను ఈ అనుభవంతోనే కరోనా వైరస్ ను తన శరీరంలోకి ఎక్కించుకుని ఉపవాసం అనే ఆయుధంతో నాలుగు రోజుల్లోనే పోగొట్టుకున్నానని చెప్పారు.
తన భార్య కూడా నేచర్ క్యూర్ లోనే ఇంకో విధానంతో గొంతులోనే ఇంకో వైరస్ ని నిర్మూలించుకుందన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తో మన దేశాన్నంతా అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ని కూడా తను, తన భార్య మా శరీరంలోకి మరోసారి ఎక్కించుకుని నేచర్ క్యూర్ పద్దతిలొ సంపూర్ణంగా ఎలా నిర్మూలించుకోవచ్చో నిరూపించోడానికి తాను మళ్ళీ సిద్ధంగా ఉన్నానంటున్నారాయన. ఈ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశం తనకు ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ఓ లేఖ రాశారు. పూర్తి వివరాలున్న వీడియో లింక్ ను కూడా ప్రధాని పంపినట్టు ప్రభాకర్ చెప్పారు.
మన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ, సుప్రీం కోర్ట్ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, హైకోర్ట్ లీగల్ సెల్ అథారిటీ చైర్మైన్ లకు కూడా లేఖ రాసి వీడియోని పంపించినట్లు వివరించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లకూ, ముఖ్యమంత్రులకూ, ఇతర అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, ఆరోగ్యశాఖ మంత్రులకూ కూడా లేఖలు రాశారట.
ఆదరణలేని ఈ వైద్య విధానాన్ని అర్ధం చేసుకుని ఏ ఒక్కరైనా సహృదయంతో స్పందిస్తే తక్షణమే నేచర్ క్యూర్ పవర్ ని తాను ఆచరణలోకి తెస్తానంటున్నారు. ఇది ఖర్చులేని ప్రక్రియ అన్నారు. దీనికి సంవత్సరాల తరబడి టైమ్ కూడా అవసరం లేదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పదిరోజుల్లోనే ఫలితాలు చూపిస్తానని హామీ ఇస్తున్నారు. తన ఈ ప్రయత్నాలకు సహకరిస్తున్న జస్టిస్ చంద్ర కుమార్, న్యాయవాది జక్కుల లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Must Read ;- గాంధీలో మృత్యు ఘోష : గుట్టలుగుట్టలుగా మృతదేహాలు, అంత్యక్రియలకు దూరం