అదేంటో గానీ.. ఇటీవలి కాలంలో ఏపీ సీఎం జగన్ నోట వెంట వస్తున్న సరికొత్త పదాలు జనాన్ని అమితాశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న.. ఏపీకి సీఎంగా ఓ మహిళ ఉందంటూ వైరల్ వ్యాఖ్య చేసిన జగన్.. తాజాగా సాగు నీటి రంగ నిపుణులకే తెలియని ఓ కొత్త పదాన్ని పలికారు. ఎడువ కాలువ అంటూ ఆయన నోట వచ్చిన ఆ పదానికి అర్థమేమిటో తెలియన నిజంగానే ఇరిగేషన్ ఎక్స్ పర్ట్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇదేదో.. జగన్ అంటే గిట్టని వారు చేస్తున్న వ్యాఖ్య కాదు. అసత్య ఆరోపణ అంతకంటే కాదు. ఎందుకంటే.. తన సొంత జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మైకు ముందుకు వచ్చిన జగన్ ఎడువ కాలువ అంటూ పలికారు. ఈ పదాన్ని ఆయన ఒక్కసారి పలికింటే ఏమోలే అనుకోవచ్చు. అదే పదాన్ని ఆయన ఏకంగా మూడు సార్లు పలకడంతో నిజంగానే ఆ పదం ఉందేమోనన్న అయోమయంలో జనం పడిపోయారు.
సొంత జిల్లా పర్యటనలో..
తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డికి నివాళి అర్పించేందుకు కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్.. గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. గురువారం సాయంత్రమే కడప చేరుకున్న ఆయన ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించి రాత్రి అక్కడే బస చేశారు. ఇక శుక్రవారం జిల్లాలోని బద్వేలు పర్యటనకు వచ్చిన జగన్.. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బద్వేలు పరిధిలోని బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు.
‘ఎడువ’ అంటే అర్థమేంటో?
ఈ సందర్భంగా బ్రహ్మం సాగర్ కు సంబంధించి ఏదో కాలువను తవ్వడం ద్వారా బద్వేలు ప్రాంతానికి మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నోట నుంచి ‘ఎడువ’ కాలువ అంటూ ఓ సరికొత్త పదం వినిపించింది. ఇదేంటని జనం ఆశ్చర్యంలో మునిగినంతనే.. మరో రెండు సార్లు జగన్ అదే పదాన్ని అదే రీతిన పలికారు. మరి ఎడమ, ఎగువ అనే పదాలను కలిపేసి ‘ఎడువ’ అనే పదాన్ని జగన్ సృష్టించారేమోలే అని జనం విస్మయం వ్యక్తం చేశారు. ఇక సాగునీటి రంగ నిపుణులైతే.. ఇదెక్కడి పదంరా బాబూ అంటూ తలలు పట్టుకున్నారు. ఇక జగన్ నోట నుంచి వచ్చిన ఈ పదంపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడిపోతున్నాయి.
Must Read ;- సీబీఐ ఓకే అంటే.. వారంలో జైలుకు జగన్