మరికొన్ని గంటల్లో అంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది అంతా కూడా వినోదాలకు .. విలాసాలకు దూరంగా గడిచింది. అందువలన కొత్త సంవత్సరం .. కొత్త ఉత్సాహంతో కొనసాగాలని కోరుకుంటున్నారు.న్యూ ఇయర్లో తమ హీరోల సినిమాలు భారీ విజయాలను సాధించాలనీ, కొత్త రికార్డులను సృష్టించాలని ఆశిస్తున్నారు. అభిమానులు కోరుకున్నట్టుగా కొత్త ఏడాదిలో సందడి చేయడానికి హీరోలంతా కూడా రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో మెగాహీరోల జోరు ఎక్కువగా కనిపించనుంది.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. వినోదం .. సందేశం సమపాళ్లలో కలిపి ఈ సినిమాను కొరటాల ఆవిష్కరించనున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో ‘కాజల్’ కథానాయికగా అలరించనుంది. చిరంజీవీ లుక్ మాత్రమే కాదు, ఈ సినిమాలోని పాటలను .. ఫైట్లను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. అవినీతి అధికారులపై .. రాజకీయనాయకులపై ఓ సాధారణ పౌరుడు సాగించే పోరాటంగా ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక చరణ్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే థియేటర్స్ కి రానుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఒక హీరోగా ‘ఎన్టీఆర్’ నటిస్తుండగా .. మరో కథానాయకుడిగా ‘చరణ్’ కనిపించనున్నాడు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో, భారీతనమే ప్రధానంగా ఈ సినిమా ఆవిష్కారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించవచ్చనీ, చరణ్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ ‘వకీల్ సాబ్’ విషయానికొస్తే, బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమానే అయినప్పటికీ .. పవన్ కి గల క్రేజ్ ను బట్టి చూస్తే పెద్ద సినిమానే. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై కూడా అందరిలో ఆసక్తి ఉంది.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘వరుణ్ తేజ్’ చేయనున్న ‘ఎఫ్ 3’ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ కొట్టిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్ కావడంతో, అందరిలో ఈ ప్రాజెక్ట్ కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. సాయిధరమ్ తేజ్ సోదరుడు ‘వైష్ణవ్ తేజ్’ హీరోగా చేసిన ‘ఉప్పెన’ కూడా న్యూ ఇయర్లోనే సందడి చేయనుంది. యూత్ అంతా కూడా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తోంది. ఇక చిరంజీవి చిన్నల్లుడు ‘కల్యాణ్ దేవ్’ హీరోగా చేసిన ‘సూపర్ మచ్చి’ కూడా నెక్స్ట్ ఇయర్లోనే విడుదల కానుంది. నాగబాబు అల్లుడు ‘చైతన్య’ హీరోగా ఎంట్రీ ఇచ్చేది కూడా వచ్చే ఏడాదిలోనే అంటున్నారు. ఇలా న్యూ ఇయర్ అంతా కూడా మెగా మెరుపులు కలర్ఫుల్ గా కనువిందుచేయనున్నాయన్న మాట.











