రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న నీటి యుద్ధాలు మరింత జఠిలమవుతున్నట్టుగానే కనిపిస్తోంది. గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి విబేధాలు లేకున్నా.. కృష్ణా జలాలకు సంబంధించి మాత్రం ఇరు రాష్ట్రాలు ఢీ అంటే ఢీ అన్న రీతిలో సాగుతున్నాయి. ఇరు రాష్ట్రాల మొండి వైఖరితో ఈ రెండు రాష్ట్రాల పరిధిలోని జలాలు, ప్రాజెక్టులన్నీ కేంద్ర అధీనంలోకి వెళ్లిపోగా.. ఈ దిశగా ఏకంగా కేంద్రం ఎంటరైపోయిన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలు తాము చేసిన పొరపాట్లను గుర్తించేందుకు సిద్ధంగా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదులు చేస్తే.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు చేస్తోంది. ఈ ఫిర్యాదులు అటు కేంద్ర జల శక్తి శాఖతో పాటు ఇటు న్యాయస్థానాల మెట్లూ ఎక్కేశాయి. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా.. న్యాయస్థానాలు మాత్రం ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై స్పందించకుండా ఉండలేని పరిస్థితి. ఇందులో భాగంగా జాతీయ హరిత ట్రిబ్యూనల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్-ఎన్జీటీ) ఇప్పటికే పలు సంచలన ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా తెలంగాణ పరిధిలోని పాలమూరు- రంగారెడ్డి పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ అభ్యంతరాలతోనే..
ఏపీ సర్కారు కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం కేంద్రంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలకు బీజం పడిపోగా.. రాయలసీమ లిఫ్ట్ ను ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ కడుతోందని తెలంగాణ ఆరోపించింది. ఎన్జీటీలో పిటిషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌కు విరుగుడుగా ఏపీ కూడా తెలంగాణ సర్కారు కడుతున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా ఎలాంటి అనుమతులు లేవని, అయినా ఆ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని, తక్షణమే ఆ పనులను నిలుపుదల చేయాలంటూ ఏపీ కూడా ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం నాడు విచారణ చేపట్టిన చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని తేల్చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులను ఎలా కడతారని ప్రశ్నించిన ఎన్జీటీ.. తక్షణమే ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కూడా తెలంగాణ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.
పనులు నిలిచేనా?
తెలంగాణ పిటిషన్ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలన్న దిశగా ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసినా.. అక్కడ పనులు ఆగిన దాఖలా అయితే కనిపించలేదు. తామేమీ కొత్త ప్రాజెక్టును కట్టడం లేదని చెబుతున్న ఏపీ సర్కారు.. అప్పటికే అందుబాటులో ఉన్న పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతున్నామని, ఇందుకు అనుమతులు ఏమీ అవసరం లేదని కూడా వాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్జీటీ కూడా ఏపీ తీరును పెద్దగా తప్పుబట్టిన దాఖలా కూడా లేదనే చెప్పాలి. అయితే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రం ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టు కిందే లెక్క. కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాతనే ఈ ప్రాజెక్టుకు పునాది పడింది. ఈ నేపథ్యంలో ఎన్జీటీ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టు పనులను తెలంగాణ సర్కారు నిలిపివేయక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కారు ఏ మేర పాటించిందో తాము కూడా అంతేమేర పాటిస్తామంటూ తెలంగాణ వాదులాటకు దిగితే మాత్రం పాలమూరు- రంగారెడ్డి పనులు కూడా ఆగవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జీవనాడి ప్రాణం పోయినట్టే