తెలంగాణ రాష్ట్ర జలప్రదాయని, సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కాలేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పలు పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(జాతీయ హరిత ట్రిబ్యునల్) తుది తీర్పును వెల్లడించింది. గతంలో ఈకేసులో వాదనలు పూర్తికాగా ఇప్పుడు తాజాగా తీర్పును వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని తేల్చి చెప్పింది.
టిఆర్ఎస్‌కు ఎదురుదెబ్బేనా?
ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ వరదల నేపథ్యంలో అధికార పార్టీపై రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కాలేశ్వరం అంశం కూడా బాగా కలసి వచ్చే అంశంగా చూడాల్సి ఉంటుంది. ఒకవైపు హైదరాబాద్ వరదలు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు రావడం లాంటి అంశాలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బలు లాగానే చూడాల్సి ఉంటుందని రాజీకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జరిగిన నష్టంపై కమిటీ ఏర్పాటు…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు లేకుండానే కట్టారని ఎన్జీటీ తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయినందున పర్యావరణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ పేర్కొన్నది. పర్యావరణ ప్రభావ మదింపు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ట్రిబ్యునల్ పేర్కొన్నది. పర్యావరణ ప్రభావం, తీసుకోవలసిన చర్యలపై ఒక కమిటీ ఏర్పాటు అవసరమని తెలిపింది. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 2008-2017 వరకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నివేదికను కమిటీ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అంశాలపై కూడా అధ్యయనం చేయాలని ఎన్జీటీ ఆదేశించింది.
ఇప్పుడేమంటారో చూడాలి..
ప్రతి రోజు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే లక్ష్యంగా ప్రాజక్టును తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును విస్తరించి మూడో టీఎంసీ కోసం టెండర్లను ప్రభుత్వం పిలిచినట్లు తెలిసింది. అయితే ప్రాజెక్టు విషయంలో ఎన్జీటీలో కేసు ఉండగా తాజాగా ఎన్జీటీ తుది తీర్పును వెలువరించింది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును తాము గొప్పగా కట్టామని చెప్పుకునే టిఆర్ఎస్ పార్టీ తాజా తీర్పు అంశంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అన్ని అనుమతులు తీసుకొనే ప్రాజెక్టును నిర్మించామని వాదించిన ప్రభుత్వానికి ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కూడా తమ అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ తీర్పు విషయంలో అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.