(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అడ్వకేట్లు, జర్నలిస్టులు, పౌర సంఘాల నేతల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. విశాఖలో పట్టుబడ్డ బంగా నాగన్న సమాచారంతో ఎన్ఐఏ ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు, ప్రజా ప్రతినిధుల కదలికల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ తనిఖీలు చేపడుతోంది. ఆరోపణల్లో భాగంగా ఇప్పటికే 63 మందిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది.
రెండు కేసుల నమోదు..
నవంబర్లో గుంటూరు జిల్లాలో, విశాఖ రూరల్లో ఏపీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అందులో విశాఖ జిల్లా ముంచింగిపుట్టు పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్టు కొరియర్‌గా అనుమానిస్తున్న నాగన్న కేసులో దాదాపు 55 మందికి పైగా వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చారు. పోలీసులు మావోయిస్టు కొరియర్‌గా అనుమానిస్తున్న నాగన్న అరెస్టు అనంతరం ఇంటరాగేషన్ లో ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అందరి పేర్లు చేర్చినట్టు తెలుస్తోంది. గుంటూరు కేసుకు సంబంధించి 27 మంది పేర్లను చేర్చారు. ఇందులో పౌరహక్కుల సంఘాల నాయకులు, విరసం నేతలు, లాయర్లు ఉన్నారు. వీరందరికీ నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని ప్రధానమైన ఆరోపణ. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేసింది.
లింకులు పరిశోధిస్తున్న ఎన్ఐఏ
ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మావోయిస్టు సంబంధిత లింకులు పరిశోధిస్తోంది. ఇందులో భాగంగా ఈ కేసు కూడా వాళ్లే పరిశోధిస్తున్నారు. పలువురుకి నిషేధిత నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానాలతో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విరసం మాజీ కార్యదర్శి వరలక్ష్మి, పౌర హక్కుల రాష్ట్ర సంఘం ప్రస్తుత అధ్యక్షుడు చిట్టిబాబు, విశాఖపట్నంలోని ఇద్దరు అడ్వకేట్లు కే పద్మ, KS Chalam, వాళ్లతో పాటు కర్నూలులోని విరసం కార్యదర్శి పాణి ఇంట్లోనూ సోదాలు సాగుతున్నాయి. సత్తెనపల్లి, తాడేపల్లిలోనూ పౌరహక్కుల సంఘ నాయకులు, ప్రగతిశీల సంఘాల నాయకుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఇదే కాకుండా తెలంగాణ పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఇంట్లో పిఎన్‌టి కాలనీ సరూర్‌నగర్‌లో సోదాలు సాగుతున్నాయి. మరి కొంతమంది పౌరహక్కుల సంఘాల నాయకులు, విరసం నాయకులతో పాటు ఆయా సంఘాలతో సంబంధాలున్న లాయర్లు ఇతర ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఇళ్లల్లో కూడా కూడా సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read:మరో ఎన్నికలకు నగరా.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వేడి