కరోనాదెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం దివాలా తీశాయి. మార్చిలో దేశంలో లాక్ డౌన్ ప్రకటించింది మొదలు, పూర్తిగా లాక్ డౌన్ నిబంధనలు సడలించే సరికి భారత్ 24 లక్షల కోట్లు జీడీపీ కోల్పోయింది. ఆర్థిక వ్యవస్థ మొదటి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు మైనస్ 8 శాతానికి పడిపోయింది. అయితే లాక్ డౌన్ నిబంధనలు దాదాపుగా పూర్తిగా సడలించడంతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది.
ప్రతి నెలా లక్ష కోట్ల జీఎస్టీ ఆదాయం రావాల్సి ఉండగా, అక్టోబర్ లో లక్షా 5 వేల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన 29.87 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలు దేశ ప్రజలను, పరిశ్రమలను ఆదుకున్నాయని ఆర్థిక మంత్రి ఢిల్లీలో వెల్లడించారు.
ఎంత సాయం చేశామంటే?
మార్చి 15నాడు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకూ ఉద్దీపన ప్యాకేజీలను కేంద్రం ప్రకటిస్తూనే ఉంది. గడచిన ఏడు మాసాల కాలంలో దేశ ప్రజలను, పరిశ్రమలను ఆదుకునేందుకు 29.87 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలు ఇచ్చినట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ఇది దేశ జీడీపీలో 15 శాతానికి సమానమని ఆమె గుర్తుచేశారు. ఇందులో ముఖ్యంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మూడు విడతలుగా 15 లక్షల కోట్లు, ఉచిత రేషన్ కు 82 వేల కోట్లు,ప్రధానమంత్రి అర్బన్ ఆవాస్ యోజనకు అదనంగా మరో 18 వేల కోట్లు కేటాయించారు. వీటికి అదనంగా పది ఛాంపియన్ సెక్టార్లకు 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినట్టు నిర్మలాసీతారామన్ గుర్తుచేశారు.
పరుగులు పెడుతోన్న ఆర్థిక వ్యవస్థ
లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో పరిశ్రమలన్నీ సాధారణ స్థితికి వచ్చాయి. 2020 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో మైనస్ 8.9 శాతం తిరోగమనవృద్ధి నమోదైంది. అయితే పరిశ్రమలన్నీ పుంజుకోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి భారత వృద్ధి రేటు
8.1 శాతానికి చేరుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా మొదటి త్రైమాసికంలో ఎకానమీ 23 శాతం పతనమైందని ఆమె గుర్తుచేశారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలను ఆదుకునేందుకు గడచిన ఆరు నెలల్లో అనేక చర్యలు తీసుకున్నామని అవి సత్ఫలితాలు ఇస్తున్నాయని నిర్మలా గుర్తుచేశారు. మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసేవారికి ఆదాయపన్నులో 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
మౌలికసదుపాయాల వృద్ధికి పెద్దపీట
దేశంలో మౌలిక సదుపాయాల వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు నేషనల్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇన్ఫ్రా ఫండ్… నిఫ్ కు లక్షా పదివేల కోట్ల సాయం చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. కరోనా కట్టడి చేసేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తయరీకి 900 కోట్లు విడుదల చేసినట్టు ఆమె తెలిపారు. ఇక కరోనా కాలంలో దేశానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి గుర్తుచేశారు. దేశంలోని 14కోట్ల మంది రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించేందుకు ఏటా కేంద్ర 65 వేల కోట్లు భరిస్తోందని ఆమె వెల్లడించారు.











