ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనుకుంటున్న అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ ఓటీటీలో విడుదలైంది. ఎలాంటి కథ అయినా చెప్పడం చేతకాకపోతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? పెద్ద సినిమా గా ఓటీటీలో ఎలాంటి ప్రభావం చూపించనుంది అనే విషయాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
కథేంటి?:
ఇంతకుముందు చాలాసార్లు చూసిన కథలాగానే ఈ సినిమా ఉంటుంది. సాక్షి (అనుష్క) అనాథాశ్రమంలో పెరిగింది. మాటలు రాకున్నా, వినిపించకున్నా ఎదుటి వ్యక్తి పెదాల కదలికతో అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోగలదు. గొప్ప చిత్ర కళ ఆమె ప్రత్యేకత. ప్రముఖ వయొలిన్ కళాకారుడైన ఆంథోనీ (మాధవన్) ఆమెలోని కళకు ముగ్ధుడవుతాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లిదాకా వెళుతుంది. ఆంథోని ఆమెకు ఉంగరం తొడిగి నిశ్చితార్థం కూడా చేసుకుంటాడు. ఆమె ఓ పెయింట్ కావాలనడంతో అది ఉన్న భవంతిలోకి ఈ జంట వెళతారు. ఆ భవంతి వెనుక ఓ పాత కథ కూడా ఉంటుంది.
ఎన్నో ఏళ్ల కిందట ఒక జంట అనుమానాస్పద స్థితిలో ఆ భవంతిలోనే చనిపోతారు.అందులోకి వెళ్లిన ఆంథోని హత్యకు గురవుతాడు. సాక్షి బయటపడుతుంది. అతన్ని ఎవరు చంపారు అన్నదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం. అప్పుడెప్పుడో వచ్చిన ‘మన్మథ’ సినిమాలో హీరో పాత్రనే తిరగేసి మరగేసి చెప్పినట్టుంది. ఈ మర్డర్ మిస్టరీని మహా అనే పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించిందన్నది కూడా మరో కోణం. పైగా ఈ సినిమాలో ఎవరు విలన్ అన్నది లాజికల్ గా మనం చెప్పడం కూడా కష్టమే. విలన్ పాత్ర, అతనికి తోడ్పడే వ్యక్తి పాత్రలు నడుచుకునే విధానంలో ఓ లాజిక్ ఉంటుంది. ఓ పాత భవనం, అందులో మర్డర్లు.. ఈ ఫార్ములా ఇప్పటిది కాదు. పాత సీసాలో కొత్త సారాను కూడా సరిగా నింపలేదు.. అందుకే ఇది సారంలేని కథగా మిగిలిపోయింది.
ఎలా తీశారు?:
ఇంతకుముందు ఎక్కడో అనేకసార్లు చూసిన కథలా ఉంటుంది. నిదానంగా సాగే కథనం మన ఓర్పుకు పరీక్షగా నిలుస్తుంది. ఓ పాత బంగ్లాలో మొదలైన కథ కొత్తదనం లేకపోతే ఎలా ఉంటుంది నిశ్శబ్దం ఓ ఉదాహరణ. దర్శకుడు హేమంత్ మధుకర్ ఇంతకుముందు ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా చేశాడు. పాత కథే అయినా కథ నడిపిన తీరు బోరు కొడుతుంది. కథనంలో నీరసం, కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి ప్రధాన మైనస్. ఏదో ఒక ప్రత్యేకత లేకుండా సినిమా చేయని అనుష్క, ఏ భాషలో అయినా ఆచితూచి క్యారెక్టర్లు ఎంచుకునే మాధవన్ వీళ్లిద్దరూ చాలదని హాలీవుడ్ లో కిల్ బిల్, రిజర్వాయర్ డాగ్స్ లాంటి ప్రఖ్యాత చిత్రాల్లో నటించిన మైఖేల్ మ్యాడ్సన్ ‘నిశ్శబ్దం’ సినిమా చేయడానికి ముందుకొచ్చారంటే దర్శకుడు హేమంత్ ఏదో అద్భుతమైన స్క్రిప్టును సిద్ధం చేసే ఉంటాడని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కానీ సినిమా మొదలైన కొన్ని నిమిషాల నుంచి అద్భుతాల కోసం నిరీక్షించి నిరీక్షించి చివరికి నిట్టూర్చడం తప్ప ఇంకేమీ చేయలేం.
పదినిముషాల సినిమా చూడగానే మనం ఈ సినిమాని చూడవచ్చోలేదో నిర్ణయించుకోవచ్చు. పెద్ద బిల్డప్ తో మొదలయ్యే ఆరంభ సన్నివేశం చూశాక ఒక గ్రిప్పింగ్ హార్రర్ థ్రిల్లర్ ఏదో చూడబోతున్నామని ఆశలు రేకెత్తిస్తుంది ‘నిశ్శబ్దం’. కానీ అవి నీరుగారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఆ బిల్డప్ ఎందుకో కూడా మనకు అర్థంకాదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రంగంలోకి దిగిన అంజలితో రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నట్లుగా వాయిస్ ఓవర్ ఇచ్చినపుడే ‘నిశ్శబ్దం’ ఎలా సాగబోతోందో సంకేతాలు అందుతాయి. ప్రథమార్ధాన్ని సాగతీసి.. తీసి.. ఇంటర్వెల్ ముందు మైఖేల్ మ్యాడ్సన్ పాత్రకు సంబంధించిన ట్విస్టుతో కథ పట్ల కొంత ఆసక్తి రేకెత్తిస్తారు. కానీ ద్వితీయార్ధంలో అనుష్క-షాలినిల ఫ్లాష్ బ్యాక్ మొదలవడంతో మళ్లీ నీరసం వచ్చేస్తుంది.
ఈ కథ కోసం అమెరికా కూడా వెళ్లనవసరం లేదు.. ఏ అమలాపురంలో సినిమా చేసినా ఖర్చు తగ్గేది కథ పట్ల ఆసక్తి పెరిగేది. అమెరికా ఖర్చుకు తగ్గ కంటెంట్ మాత్రం ‘నిశ్శబ్దం’లో లేదు. ఈ సినిమాకు అమెరికా నేపథ్యం బలం కంటే కూడా బలహీనత అని చెప్పొచ్చు. కథ నడిచే తీరు ప్రకారం చూస్తే అది ఏమాత్రం అవసరం లేదనిపిస్తుంది. ప్రధాన పాత్రలు ‘ఫలానా’ అని చెప్పుకోవడానికి గొప్పగా అనిపించడం తప్ప.. వాటిని తీర్చిదిద్దిన విధానంలో ఏ ప్రత్యేకతా లేకపోయింది.
ఎవరెలా చేశారు?:
అనుష్కది కూడా నటనకు అవకాశమున్న పాత్రకాదు. ఆమెను మూగదానిగా చూపించాల్సిన అవసరమేమిటో తెలియదు. మాధవన్ నటనకు మంచి మార్కులు వేయవచ్చు. పోలీస్ పాత్రమహాగా అంజలిని చూపించారు. ఆమె తన వయసు తగ్గించుకున్నట్టు కనిపిస్తుంది తప్పితే ప్రత్యేకత ఏమీలేదు. ఆమె భర్తగా అవసరాల శ్రీనివాస్ పాత్ర కూడా ప్రయోజనం లేనిదే. షాలినీ పాండే, సుబ్బరాజు ఫరవాలేదు. మైఖేల్ మాడ్సన్ ఒక్కడే ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఎక్కడా ఎమోషన్ పండని పాత్రలే కనిపిస్తాయి. చాలా సన్నివేశాలు అనవసరంగా పెట్టారని భావన కలుగుతుంది. అవసరాల శ్రీనివాస్ పాత్ర అలాంటిదే. నటులను సరిగా ఉపయోగించుకోలేదనే భావన కలుగుతుంది.
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, , సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు
కథనం: కోన వెంకట్
సంగీతం: గోపి సుందర్
నేపథ్య సంగీతం: గిరీష్ జి.
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్
విడుదల తేదీ: అక్టోబరు 2, 2020
ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్
నిర్మాణం: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రేటింగ్: 2/5
– హేమసుందర్ పామర్తి











