హీరో గోపీచంద్ తేజ తెరకెక్కించనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’లో నటిస్తున్నాడు. ఇందులో అలిమేలు మంగ పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ పాత్ర మీదే మొత్తం కథ తిరుగుతుంది. అలాంటి ఈ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. ఇప్పటికి వస్తున్నాయి కూడా. కారణం ఇప్పటివరకు హీరోయిన్ ను దర్శకుడు తేజ ఫైనల్ చేయకపోవడమే కారణం.
ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ ను ఫైనల్ చేశారని వినికిడి. అయితే ఇప్పటికే దర్శకుడు అనేకమంది స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించాడు. ముందుగా ఈ సినిమాకు కాజల్ ను తీసుకుందామని అనుకున్నాడు తేజ. కానీ ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ఆలోచన పక్కన పెట్టేసాడు తేజ. తర్వాత అనుష్కను సంప్రదించగా, ఆమె కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. సాయి పల్లవి, కీర్తి సురేష్ లను కూడా అనుకున్నాడు తేజ.
కానీ చివరికి నివేదా థామస్ కే ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్, తేజ దర్శకత్వంలో ‘జయం’, ‘నిజం’ లాంటి సినిమాలలో విలన్ గా నటించాడు. ఈ రెండూ హిట్టయి గోపీచంద్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు తేజ దర్శకత్వం లో మొదటిసారిగా హీరోగా చేస్తున్నాడు అతడు. తేజ అనగానే ప్రేక్షకుల్లో, గోపీచంద్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉండడం సహజమే. దర్శకుడు ఈ కథను గోపీచంద్ కు తగ్గట్టు తీర్చిదిద్దాడు అని తెలుస్తోంది. గోపీచంద్ కూడా తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. మరి గోపీచంద్ కి తేజ ఏ రేంజ్ హిట్టిస్తాడో చూడాలి.