విజయవాడ మేయర్ అభ్యర్థి కోసం వైసీపీ హైకమాండ్ పడుతున్న తిప్పలు, అభ్యర్థుల వేటలో ఎదురువుతున్న పరాభవాలు అన్నీ ఇన్నీ కావు. విజయవాడలో వైసీపీ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో చెప్పడానికి ఈ పరిణామాలే నిదర్శనం. కూటమి బలంగా ఉండడంతో వైసీపీ తరపున పోటీ చేసేందుకు బడా నేతలు సైతం వెనుకాడుతున్నారు. విజయవాడ మేయర్ స్థానానికి ఓట్లు రాబట్టే సామర్థ్యం, కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చు భరించే సత్తా ఉన్న అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం తీవ్రంగా శ్రమించింది. కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో మొదట్లో వద్దు అనుకున్న మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని బరిలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది.
తొలుత దేవినేని అవినాష్‌ను గానీ, ఆయన సతీమణిని గానీ బరిలోకి దింపాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సానుకూల స్పందన రాలేదు. గతంలో జరిగిన అవమానాలతో యలమంచిలి రవిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన కనీసం ఫోన్లో కూడా కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఇక, మాజీ ఎంపీ కేశినేని నాని తనయ శ్వేతను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినా, ఆమె కూడా పోటీకి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. బంధుత్వాలు, పార్టీలో ప్రాధాన్యం ఉన్న దేవినేని గౌతమ్‌రెడ్డి తన కుమార్తెను బరిలోకి తీసుకురావాలని ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నేతలందరి వద్దకూ వెళ్లే పరిస్థితి వచ్చినా, ఒక్కరు కూడా పోటీకి సాహసించలేదు.
నిజానికి, ఆర్థికంగా, రాజకీయంగా గట్టిగా పోరాడలేరన్న కారణంగా మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని వైసీపీ వద్దనుకుంది. ఐతే రేసులో నిలబడతారని భావించిన బడా నేతలంతా దండం పెట్టి తప్పుకోవడంతో దిక్కు తోచని స్థితిలో వైసీపీ పెద్దలు చివరికి రాయన భాగ్యలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు. ఐతే రాయన భాగ్యలక్ష్మి సైతం అంతా ఈజీగా ముందుకు రాలేదు. ఆమె పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చారు. నామినేషన్ల పర్వం దగ్గరపడుతున్న సమయంలో తన వద్ద రూపాయి కూడా లేదని తేల్చిచెప్పేశారు.
అభ్యర్థిగా ప్రకటించి చేతులు దులుపుకుంటే కుదరదని, ఎన్నికల ఖర్చులన్నీ పార్టీయే భరించి ముందుగా డబ్బులు ఇస్తేనే నామినేషన్ వేస్తానని వైసీపీకి కండీషన్ పెట్టారు భాగ్యలక్ష్మి. అంతేకాదు, విజయవాడ శివారులోని 22A నిషేధిత జాబితాలో ఉన్న తన భూమిని ఎవరికైనా అమ్మి పెట్టి, డబ్బులు సర్దుబాటు చేస్తేనే ఖర్చు పెడతానని మెలిక పెట్టడంతో ఇప్పుడు వైసీపీ నేతలు తల పట్టుకుంటున్నారు. అభ్యర్థులు కరవై, ఉన్న అభ్యర్థి ఖర్చుల బాధ్యతను పార్టీపైనే నెట్టేయడంతో విజయవాడ మేయర్ స్థానంలో వైసీపీకి చావుదెబ్బ తిన్నట్లయిందనే చర్చ జోరుగా సాగుతోంది.











