DSC నియామకాల విషయంలో వైసీపీ నేతల తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. సాక్ష్యాలు లేకుండా కోర్టులో కేసులు వేసి అక్షింతలు వేయించుకున్న నేతలు, ఇప్పుడు హఠాత్తుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ సరికొత్త డ్రామాలకు తెరతీశారు. రాష్ట్రంలోని ప్రజలు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారనే భ్రమలో వైసీపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.ఒకసారి కోర్టులో భంగపడినప్పటికీ..కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ తరహా ఆందోళనలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత నెలలో జరిగిన పరిణామాలను నిశితంగా గమనిస్తే ఈ డ్రామా వెనుక ఉన్న అసలు రూపం బయటపడుతుంది. DSC నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ వైసీపీ MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తున్నప్పుడు ఆ అభ్యర్థులను ఎందుకు ప్రతివాదులుగా చేర్చలేదని కోర్టు గట్టిగా నిలదీసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దుర్వినియోగం చేయవద్దని, ఆధారాలు లేకుండా పిటిషన్లు వేయడంపై న్యాయస్థానం తీవ్రస్థాయిలో చివాట్లు పెట్టి కేసును కొట్టివేసింది.
ఐతే, కోర్టులో సాక్ష్యాలు చూపలేక మొట్టికాయలు తిన్న అదే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు సరికొత్త వేషంలో ముందుకొచ్చారు. DSC అక్రమాలకు సంబంధించి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ, ఆ ఆధారాలను చూపించేందుకు వెళ్తున్నామనే నెపంతో SAP కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ, సాక్ష్యాలు చూపించడానికి వెళితే హత్యాయత్నమా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే వైసీపీ నేతల రాజకీయ దివాళాకోరుతనం స్పష్టమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు సాక్ష్యాలు అడిగినప్పుడు నీళ్లు నమిలి, కనీసం బాధితులను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టలేకపోయిన వారు, ఇప్పుడు రోడ్లెక్కి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా మారింది. సాక్ష్యాలు నిజంగా ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలి గానీ, ఇలా ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం కేవలం ప్రజల దృష్టిని మరల్చే డ్రామా మాత్రమేనని స్పష్టమవుతోంది.











