DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయని, APPSCకి, DSCకి తేడా తెలియని వాళ్లు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. అయినా సరే తాము భయపడేది లేదని తేల్చిచెప్పారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని కీలక ప్రకటన చేశారు. 2029 లోగా రాష్ట్రంలో మరో 3 DSCలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గతేడాది మెగా DSC ద్వారా 16 వేల టీచర్ పోస్టుల భర్తీని ఎంత పారదర్శకంగా నిర్వహించామో.. భవిష్యత్తులోనూ అదేవిధంగా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని భరోసానిచ్చారు.
సమాజంలో గౌరవంగా, నిజాయతీగా ఎలా బతకాలో తనకు నేర్పింది తన తండ్రి చంద్రబాబు అని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖలో పూర్తిగా పారదర్శక విధానాలు అమలుచేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో తెచ్చిన జీవో 117 వల్ల ఏకంగా 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారని, తాము అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేశామని గుర్తుచేశారు. మంగళగిరి నిడమర్రులో అభివృద్ధి చేసిన లీప్ మోడల్ స్కూల్‌ను రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ అమలుచేస్తామని తెలిపారు.
ఉపాధ్యాయుల కృషితోనే ఈ ఏడాది ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఏకంగా 1.10 లక్షల మంది విద్యార్థులు మారారని లోకేశ్ కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇంటర్మీడియట్లో 10 వేల అడ్మిషన్లు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో వస్తున్న స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఫార్మా ఎకోసిస్టమ్, డేటాసెంటర్ల వంటి 23 క్లస్టర్లతో విశ్వవిద్యాలయాలు ఇంటిగ్రేట్ కావాలని సూచించారు.
ఈ సమావేశంలో చంద్రబాబు హయాంలో వచ్చిన DSCల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో ప్రకటించిన DSCల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఎందరున్నారో చేతులెత్తాలని లోకేశ్ కోరగా, సభలోని ఉపాధ్యాయులందరూ చేతులెత్తి మద్దతు తెలిపారు. ఇప్పటివరకు 14 డీఎస్సీల ద్వారా సుమారు 2 లక్షల మందిని చంద్రబాబు నాయినే నియమించారని గుర్తుచేశారు. DSC అంటే సీబీఎన్.. సీబీఎన్ అంటే DSC అని లోకేశ్ స్పష్టం చేశారు.











