ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎంపీ అభ్యర్థుల వైఎస్ఆర్ సీపీకి తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎంపీలంతా మళ్లీ లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి నిరాసక్తి చూపుతున్నారు. ఎంపీలుగా ఉన్న వారు కొంత మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇంకోవైపు, కొంత మంది ఎంపీలను తప్పించాలని కూడా వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది. వారిలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మొదటి స్థానంలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి ఏపీలో ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధుల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని ఎంపీలుగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు. తాజాగా ఎక్కడా కనిపించని ఓ అధికార పార్టీ ఎంపీ మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేసేది లేదని ఓ ప్రకటన నేరుగానే చేశారు. గత ఎన్నికల్లో తొలిసారి ఏలూరు ఎంపీగా గెలిచిన కోటగిరి శ్రీధర్ ఈ ఐదేళ్లు గడిచినప్పటికీ ఎవరికీ అంతగా తెలియదు. ఏలూరులో ఉన్న రాజకీయ విభేదాలే ఇందుకు కారణమని అంటారు. ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని అధిష్టానంతో తనకు ఉన్న సంబంధాలతో ఎంపీ కోటగిరి శ్రీధర్ ను కట్టడి చేశారని ప్రచారం ఉంది. అందుకే మరోసారి పోటీ చేయకూడదని కోటగిరి శ్రీధర్ నిర్ణయించుకున్నారట. ఇటీవల వెలమ సంఘం సమావేశంలో కోటగిరి శ్రీధర్ ఈ ప్రకటన చేశారు.
వీరు కాక, ఎంపీ మార్గాని భరత్ కూడా తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని గతంలో సంకేతాలు ఇచ్చారు. ఇటు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని దాదాపు ఖాయం అయింది. నరసాపురం ఎంపీ రఘురామ స్థానంలో కూడా కొత్త వారిని వెతుక్కోవాల్సి ఉంది. మొత్తానికి వైఎస్ఆర్ సీపీకి ఈసారి ఎంపీ అభ్యర్థుల విషయంలో టెన్షన్ తప్పేలా లేదు. అసలే గాలి టీడీపీ – జనసేన వైపు వీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నేత దొరకడం అధికార పార్టీకి అతి కష్టంగా మారింది.