ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో చేస్తున్న ప్రసంగం గమనిస్తున్నారా? రాన్రానూ నిస్సత్తువగా జగన్ వ్యాఖ్యలు ఉంటున్నాయి. దాదాపు ఐదు సంవత్సరాలుగా పరిపాలించిన ఆయన తానేం చేశానో చెప్పుకోవడానికి ఆయనకు కూడా ఏ అంశాలు దొరకడం లేదు. ‘‘ప్రతి ఇంటికి మీ బిడ్డ చేసిన మంచిని గమనించండి.. బటన్ నొక్కి నేరుగా మీ బిడ్డ డబ్బుల్ని మీ అకౌంట్లలో వేశాడు. ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా నగదు బటన్ నొక్కి వేశాడు’’ అని చెప్పుకోవడం తప్పితే ఆయన తన పాలనలో చేసిన మరే పని గురించి చెప్పుకోలేకపోతున్నారు. నిజానికి అక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశాల గురించి జగన్ అసలు మాట్లాడకపోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రిజైన్ చేశారు. ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే ఉప ఎన్నికలు రావని తెలిసే అప్పుడు ఆ నాటకం ఆడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పని చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్య పెట్టారు.
ఇప్పుడు చూస్తే అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడసలు ప్రత్యేక హోదా అంశం గురించే ఎత్తట్లేదు. పోలవరం ప్రాజెక్టు పని కూడా మాట్లాడడం లేదు. గత ఎన్నికలకు ముందు ఈ రెండు అంశాలే ప్రధానంగా ఉన్నాయి. ఆ రెండిటినీ జగన్ రెడ్డి పరిష్కరించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆఖరికి సొంత జిల్లా కడపలో నిర్మించతలపెట్టిన కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదవి విప్పలేకపోవడం ఆయన అసమర్థతకు అద్దం పడుతోంది.
ఈ రకంగా వైఎస్ జగన్ యాత్ర కొనసాగితే ఇక కొంపమునగడం ఖాయమని వైసీపీ శ్రేణులే అసమ్మతి వ్యక్తం చేస్తున్నాయి. ఇడుపుల పాయ నుంచి మొదలైన బస్సు యాత్ర, ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి పూర్తిగా సల్లబడిపోయింది. కృష్ణా, గుంటూరు జిల్లాలో అయితే అసలు జనమే లేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర, చివరికి తుస్సు యాత్రగా మిగిలిపోయింది. ఎంతసేపూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం.. చంద్రబాబు వెన్నుపోటు అంటూ జగన్ మాట్లాడి మాట్లాడి.. వినే జనానికి వెగటు పుట్టిస్తున్నారు. రాష్ట్రానికి పనికొచ్చే కొత్త అంశాలను ప్రస్తావించకుండా.. విపక్షాలపైన దుమ్మెత్తిపోయడమే జగన్ రెడ్డి అజెండా అయిపోయింది. రాష్ట్రానికి అభివృద్ధి అనేది చాలా కీలకం. పోలవరం వీలైనంత త్వరగా పూర్తి కావాల్సిన ప్రాజెక్టు. అది జీవనాడి… ఇలాంటి విషయాలను జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.