తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులకు, వానలు పడకపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం కాదని.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వాతావరణ మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ‘ఎల్ నినో’ వంటి శాస్త్రీయ కారణాల వల్ల వర్షాలు కురవడం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నప్పటికీ.. అనిరుధ్ రెడ్డి మాత్రం విచిత్రంగా చంద్రబాబు వైపే వేలు చూపించడం గమనార్హం.
అయితే, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ నేపథ్యాన్ని గమనిస్తే అసలు విషయం అర్థమవుతుందట. అనిరుధ్ రెడ్డి 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఇప్పటికీ ఆయనకు వైఎస్ జగన్కు అనుకూలంగా ఉండే ‘ప్రో-జగన్’ ఎమ్మెల్యేగానే పేరుంది. ఆ అభిమానంతోనే చంద్రబాబుపై ఈ విధమైన రాజకీయ విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, చంద్రబాబుపై అనిరుధ్ రెడ్డి విమర్శలు చేసిన మరుసటి రోజే.. ఆయన వ్యాఖ్యలకు ‘ప్రకృతి’ తనదైన శైలిలో గట్టి సమాధానం ఇచ్చిందంటున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి ఏపీ తీరం వైపు దూసుకొస్తోందట. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తూ, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
విశాఖకు 820 కిలోమీటర్లు, కాకినాడ, మచిలీపట్నం, బాపట్లకు సమీపంలో కేంద్రీకృతమైన ఈ తుపాను తీవ్ర వాయుగుండంగా మారి, బుధవారం నాటికి బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో విశాఖ, కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు సహా 12 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవనున్నాయి.
ఒకవైపు వర్షాలు పడటం లేదని, దానికి చంద్రబాబే కారణమని అనిరుధ్ రెడ్డి విమర్శిస్తే.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను విరుచుకుపడుతూ తెలుగు రాష్ట్రాలను ముంచెత్తడానికి సిద్ధమైందట. దీంతో రాజకీయాల కోసం ప్రకృతిని కూడా ముడిపెడుతూ వ్యాఖ్యలు చేసిన ‘ప్రో-జగన్’ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ప్రకృతి సరిగ్గా ఇలాగే సమాధానం ఇచ్చిందని విశ్లేషకులు చురకలు వేస్తున్నారు.











