2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 స్థానాలను గెలుచుకుని ఘన విజయం సాధించామని ఢంకా భజాయించి మరీ చెప్పుకుంటున్న వైసీపీ.. కారణమేమో తెలియదు గానీ.. ఆ తర్వాత దొంగ ఓట్లనే ఆశ్రయిస్తూ అడ్డంగా బుక్ అయిపోతోంది. ఇటీవలే ముగిసిన తిరుపతి లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు ఇతర నియోజకవర్గాలకు చెందిన ప్రజలను భారీ ఎత్తున తిరుపతి తరలించి దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఎన్నికల్లో ఇతర నియోజకవర్గాలకు చెందిన జనాన్ని బస్సులు, ఇతర వాహనాల్లో తరలిస్తూ వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు కూడా. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన బద్వేల్ ఉప ఎన్నికలోనూ వైసీపీ అదే మంత్రాన్ని జపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్‌లో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఇతర నియోజకవర్గాలకు చెందిన జనం పోటెత్తుతున్నారట. దీనిని గమనించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో బద్వేల్‌లోని పలు ప్రొంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
నకిలీ ఐడీ కార్డులతో ఎంట్రీ
బద్వేల్ ఉప ఎన్నికలో ఓటు వేయాలంటే స్థానికులై ఉండాలి కదా. అలాంటి స్థానికులకు అక్కడి అడ్రెస్‌లతోనే గుర్తింపు కార్డులు కూడా ఉంటాయి కదా. అయితే బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో స్థానిక గుర్తింపు కార్డులతో కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన గుర్తింపు కార్డులతో పలువురు కనిపించారు. వీరి గుర్తింపు కార్డులను పరిశీలించిన పోలీసులు.. వారిని పోలింగ్ కేంద్రాల్లోని అనుమతించడం లేదు. ఇలాంటి ఘటన నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం గ్రామంలో బయటపడింది. గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారట. వారి గుర్తింపు కార్డులను పరిశీలించిన పోలీసులు షాక్ తిన్నారట. ఎందుకంటే.. వారంతా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వారే కాదట. ఈ విషయాన్ని ఆ మహిళలకు తెలపడంతో పాటుగా ఇతర నియోజకవర్గాలకు చెందిన మీరు ఇక్కడికెందుకు వచ్చారని ప్రశ్నించారట. అయితే ఆ మహిళల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా వెనక్కు పంపారట. మరోవైపు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయట. కొన్ని గ్రామాల్లో తమ గ్రామానికి చెందని వారిని గుర్తించిన స్థానికులు వారిని తరిమికొట్టే యత్నం చేశారు. ఈ తరహా పరిస్థితిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తిరుపతిలోనూ దొంగ ఓట్ల సునామీ
కొన్ని నెలల ముందు తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి చెందిన చాలా మంది ఓటర్లు తిరుపతి, పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కనిపించారు. వీరంతా తిరుపతిలో ఓటు వేసేందుకే వచ్చారని టీడీపీ నేతలు ఆధారాలు సైతం సేకరించారు. ఈ సందర్భంగా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇతర నియోజకవర్గాల ప్రజలను, వారి రవాణాకు వినియోగించిన వాహనాలను ఇటు టీడీపీతో పాటు అటు బీజేపీ నేతలు కూడా రెడ్ హ్యాండెడ్‌గానే పట్టుకున్న వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాము దొంగ ఓట్లు వేయించలేదని, అసలు ఆ అవసరమే తమకు లేదంటూ వైసీపీ నేతలు చెప్పుకున్నారు. ఈ మాటలన్నీ అబద్ధమేనని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రత్నప్రభ స్వయంగా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించారు. అంతేకాకుండా అలా దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అడిగి.. వారెక్కడివారో వారితోనే చెప్పించిన టీడీపీ నేతలు వైసీపీ కుయుక్తులను బయటపెట్టారు. అయితే ఈ ఆరోపణలపై అటు ఎన్నికల సంఘం స్పందించకపోవడం, ఇటు పోలీసులు నమోదు చేయకపోవడంతో తిరుపతి ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో గెలిచారు. తాజాగా బద్వేల్ పోలింగ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే.. ఇక్కడ కూడా దొంగ ఓట్లతోనే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలిచే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బైపోల్ షురూ!.. రెండు చోట్లా గలాటలే!