జులై 27వ తేదీన పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన నాయకుడు రెండునెలల్లో రాష్ట్రమంతా పర్యటించి.. తన అస్తిత్వాన్ని చాటుకోవడమే కష్టం. అలాంటిది.. సోము వీర్రాజు మాత్రం.. ఒక అడుగు ముందుకేసి.. తన అస్తిత్వానికి వ్యతిరేకతను కూడా కూడగట్టుకోగలిగారు. సాధారణంగా రాష్ట్రకమిటీ ఏర్పాటు పర్వం పూర్తయితే అక్కడితో ఎవ్వరిలోనైనా ఉండే అసంతృప్తులు సమసిపోవాలి. కానీ ఆ పార్టీలో చిత్రమేంటంటే.. ఇప్పుడే మొదలవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పార్టీ శ్రేణుల్లో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోందంటున్నారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో ఒంటెత్తు పోకడలు పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లో కొత్త కదా అని భావించిన సీనియర్ నాయకులకు ఆ తర్వాత సోము వీర్రాజు చర్యలు మింగుడు పడడం లేదంటున్నారు.
పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించిన సమయంలో సోము వీర్రాజు ధోరణి పూర్తిగా వెలుగులోకి వచ్చిందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సోము తీసుకునే ప్రతి చర్యా రెండు వర్గాలకు మాత్రమే మేలు చేసేలా ఉందనేది సీనియర్ల ఆరోపణ. ఈ రెండు వర్గాల్లో ఒకటి ప్రభుత్వానికి అనుకూలం అయితే, రెండోది తన సామాజిక వర్గమైన కాపులకు ఉపకరించేదని అంటున్నారు. గతంలో ఉన్న పాత వర్గపోరును అవకాశం వచ్చిన ఇప్పుడు వాడుకుంటున్నారని, కావాలని ఓ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని అంటున్నారు.
జూనియర్లకు అందలం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా కార్యవర్గాలలోనూ జూనియర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించారని అంటున్నారు. ఇలాంటి చర్యల ద్వారా పార్టీకి సీనియర్ల అవసరాలు లేవని చెప్పకనే చెప్పారని సీనియర్ నాయకుడొకరు లియో న్యూస్ ప్రతినిధితో అన్నారు. “రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉనికిని కాపాడింది సీనియర్లే. ఇక్కడ దశాబ్దాల కాలంగా పార్టీ ప్రజల్లోకి వెళ్లిందంటే సీనియర్ల వల్లే. అలాంటి సీనియర్లను పక్కన పెట్టారు. పైగా వారిని అవమానించడానిక అన్నట్లుగా జూనియర్లకు అవకాశాలు కల్పిస్తున్నారు“ అని ఆయన వాపోయారు.
గతంలో అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా… పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా తెలియకపోయినా రాజకీయానుభవం దృష్ట్యా సీనియరను గౌరవించారని చెబుతున్నారు. సోము వీర్రాజు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ముందు నుంచి పార్టీలో ఉన్న ఆయన ఇలా ప్రవర్తించడం దారుణమని సీనియర్లు వాపోతున్నారు.
అధిష్టానం అండ ఉందా..
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెత్తు పోకడల వెనుక అధిష్టానం అందదండలున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. అధిష్టానం నుంచి ఉన్న ఆశీస్సుల కారణంగానే ఆయన అలా వ్యవహరిస్తున్నారని పార్టీలో మరో వర్గం అంటోంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగకపోవడానికి ఓ వర్గం కారణమంటూ అధిష్టానం వద్ద సోము వీర్రాజు బలంగా వాదించారని, దీన్ని ఆపాలంటే కఠినంగా వ్యవహరించాలంటూ పార్టీ అధ్యక్షుడితో పాటు హోం మంత్రి అమిత్ షాలకు నివేదించినట్లు చెబుతున్నారు.
దీంతో వారు కూడా సోము వీర్రాజు చెప్పిన అసత్యాలను నమ్మినట్టుగా ఉందని, పార్టీని గాడిలో పెడతానంటూ సోము వీర్రాజు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు పగ్గాలు అప్పగించారని చెబుతున్నారని అంటున్నారు. “ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఏం జరిగినా తాము పట్టించుకోమని, తమకు మంచి ఫలితాలు చూపించాలని అధిష్టానం సోము వీర్రాజును ఆదేశించింది. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తున్నారు “ అని సీనియర్ నాయకుడు చెప్పారు. ఏది ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మాత్రం లుకలుకలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.