తెలుగుదేశం పార్టీ పై టాలీవుడ్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లలో ఆంధ్ర ప్ర లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టిడిపి పై ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పేరుగుతోందని, 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్న రాఘవేంద్ర రావు, ఆ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఎన్టీఆర్ దార్శనికుడని..పార్టీ నాయకులు ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెనాలిలో ఏడాదంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పారు.