కొన్ని వందల సంవత్సరాల పోరాట ఫలితమే భారత స్వాతంత్రం. అటువంటి స్వతంత్ర దేశాన్ని నడిపించడానికి కొన్ని విధానాలు, మార్గదర్శకాలు అవసరం. దేశంలలోని సామాన్య ప్రజల నుండి దేశాధ్యక్షుని వరకు అందరికీ దిశా నిర్ధేశం చేసే విధానాలు అవసరమని భావించి, ఎందరో మహానుభావుల కలిసికట్టుగా చేసిన రూపకల్పనే ఈ ‘భారత రాజ్యాంగం’.
రాజ్యాంగ దినోత్సవం ఎలా ఆవిద్భవించింది?
1950వ సంవత్సరం జనవరి 26 న రాజ్యాంగం అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. దానిని గుర్తిస్తూ ‘గణతంత్ర దినోత్సవం’ గా జరుపుకుంటున్నాం. మరి నవంబర్ 26 ఏమిటి? 1949 నవంబర్ 26 న మొదటి సారిగా భారత రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకునే నేడు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1976 లో రాజ్యాంగం రూపకల్పన జరిగిన నవంబర్ 26 ను అందరూ గుర్తించుకునే విధంగా ‘న్యాయ దినోత్సవం’గా జరపాలని అప్పటి న్యాయమూర్తులు నిర్ణయించారు. ఆ తర్వాతి కాలంలో 2015 లో నవంబర్ 26 ను అధికారకంగా ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకునే విధంగా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుండి దేశమంతా నవంబర్ 26 ను ‘రాజ్యాంగ దినోత్సవంగా గుర్తించారు.
రాజ్యాంగ రూపకల్పన జరిగిందిలా
బ్రిటీష్ వారి నుండి భరతమాతకు స్వాతంత్రం లభించింది. ఇక ఆపై ఉన్నదే అసలు కథ. దేశాన్ని నడిపించే, నిర్ధేశిందే సూచికలు అవసరం. అప్పుడే రాజ్యాంగ రూపకల్పనకు పూనుకున్నారు. మొత్తం 299 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. అందులో 15 మంది మహిళలకు కూడా చోటు దక్కడం విశేషం. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో, అంబేడ్కర్ సారధిగా, బి ఎన్ రావు రాజ్యంగ సలహాదారు గా నియమితులయ్యారు. సభ్యుల మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9 వ జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల అనంతరం అఖండ భారత్ కు లిఖిత రాజ్యాంగం సిద్ధమైంది. 1949 నవంబర్ 26 న అప్పటి రాజ్యాంగ పరిషత్ దీనికి ఆమోదం తెలిపింది.
అసలేంత మందికి తెలుసు?
నేటి కాలం యువతకు రాజ్యాంగ దినోత్సవం అనేది ఉందని తెలుసా అంటే లేదనే సమాధానమే ఎక్కువగా వస్తుంది. అందరికీ జనవరి 26 వ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న రోజు మాత్రమే తెలుసు. నవంబర్ 26 ప్రత్యేకత, దాని వెనకగల ప్రాముఖ్యత తెలిసిన చాలా తక్కువ. అటువంటి వారికి ఈరోజు ప్రాముఖ్యతని తెలియజేయడానికే ప్రభుత్వం ఈ రోజును నిర్ధేశించింది. కానీ వాడవాడలా ‘రాజ్యాంగ దినోత్సవం’ జరుపుకున్నంత మాత్రానా దాని వెనకగల అంతరార్ధం తెలియదు. పాఠశాలల దశ నుండే ‘రాజ్యాంగ దినోత్సవం’ జరుపుకునేలా ప్రోత్సహించి, పిల్లలకు దీని వెనకగల అంతరార్ధాన్ని తెలియజేసినపుడే భారత రాజ్యంగ విలువను పిల్లలు తెలుసుకునే వీలుంటుంది. ఇలాగే నామమాత్రంగా జరుపుకుంటూ ఉంటే, తొందరలో రాజ్యంగం అంటే ఏమిటో కూడా తెలియకుండా తయారువుతారు మన తరవాతి తరం వారు.